న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
● ఇలా పలకరించి.. అలా వెళ్తున్న ‘తొలకరి’
● వానాకాలం సాగుపై ఎల్‌నినో ప్రభావం
● దుక్కులు దున్ని .. విత్తనం వేసిన రైతన్న
● వానదేవుని కోసం నిరీక్షిస్తున్న అన్నదాత
దుక్కులు దున్ని.. విత్తనం వేసి
కొద్దిరోజుల క్రితం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కులు దున్ని నేలను సాగుకు సిద్ధం చేశారు. సుమారు 90 వేల ఎకరాలకు సరిపడా వరినారు పోశారని వ్యవసాయాధికారులు తెలిపారు. 12వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్టు అంచనాకు వచ్చారు. వరినారుకు అవసరమైన నీటిని బోర్లు, వ్యవసాయబావుల ద్వారా అందిస్తున్న రైతులు ఊరట చెందుతుండగా, కాలువ నీటిపై ఆధారపడ్డ వారు నిరాశలో ఉన్నారు. పెద్దపల్లి మండలంలో అక్కడక్కడా వరినా రు సైతం ఎండిపోతోందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తగా, నేలలో వేసిన విత్తనానికి మోతాదులో నీరందితేనే బతుకుందని, లేకుంటే పెట్టుబడి మునుగుడేనని రైతులు వాపోతున్నారు.
సాగునీటికి తండ్లాట
పత్తి విత్తనం వేసిన రైతులు దానిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటశివారులో రైతులు బండి లక్ష్మణ్, కనకయ్య తమ వ్యవసాయ బావిలోని నీటిని పైపుల ద్వారా అందించే ఏర్పాట్లలో కనిపించారు.
సాగుపై ‘ఎల్‌నినో’..
అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, రుతుపవనాల బలహీనతతో ఈసారి సాగుడెలా? అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోతే సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలని వారు సూచిస్తున్నారు.
పెద్దపల్లిరూరల్: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతన్నను ఎల్‌నినో ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని 14 మండలాలు, 263 గ్రామాల్లో ఈసారి సుమారు 2,15,000 ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం కురిసిన తొలకరితో మురిసిన అన్నదాత.. దాదాపు 90 వేల ఎకరాలకు సరిపడా వరినారు పోశాడు. 12 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు చల్లాడు. వరుణుడి కరుణ కోసం
ఆకాశం వైపు ఆశగా నిరీక్షిస్తున్నాడు.


