సాక్షి,పెద్దపల్లి:
జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భావించిన ఈ ప్రాజెక్ట్‌లో అనూహ్యంగా అలైన్‌మెంట్ (రోడ్డు మార్గం) మారడం, భూసేకరణ పూర్తి కాకముందే పనులు ప్రారంభించడంపై రైతు లు తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతం కాకుండా మరోప్రాంతం వైపు మళ్లించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శంకుస్థాపన చేసిన ప్రాంతం వద్ద రాజీవ్ రాహదారిని కలిపే ప్రాంతంలో ఒకేసారి 95 డిగ్రీలు టర్న్ చేయా ల్సిన పరిస్థితి నెలకొందని, అలా చేయడం ద్వారా ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకే కొత్తరూట్‌లో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెబుతున్నారు.
నెలరోజుల్లోనే మారిపోయిన బైపాస్ మార్గం
పెద్దపల్లి పట్టణ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ.82 కోట్ల వ్యయంతో 12.1 కిలోమీటర్ల పొడవున బైపాస్ రోడ్డు నిర్మాణానికి మే 9న శంకుస్థాపన చేసింది. పెద్దకల్వల నుంచి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు డబుల్ లేన్ రోడ్డుతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. శంకుస్థాపన జరిగిన కొద్దిరోజులకే తొలుత ప్రకటించిన అలైన్‌మెంట్‌లో మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రజలకు చూపించిన మార్గం కాకుండా మరోదిశగా సర్వే పనులు సాగుతుండడంతో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బాధిత రైతులూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో కొందరు భూములు తప్పించుకోగా, కొత్తగా మరికొందరి వ్యవసాయ భూములు రోడ్డు పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభావిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెరవెనుక ఒత్తిళ్లపై ఆరోపణలు
రూట్ మార్పు వెనుక భారీస్థాయిలో ఒత్తిళ్లు లేదా ఆర్థికలావాదేవీలు జరిగి ఉండవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి వివరణ లేకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తొలుత నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారో అధికార యంత్రాంగం నుంచి స్పష్టత రాకపోవడంతో అన్నదాతలు నిరసనలు, ఆందోళనకు దిగుతున్నారు.
భూసేకరణ చేయకుండానే పనులు
గతంలో హైదరాబాద్ తాగునీటి పైప్‌లైన్ కోసం సేకరించిన 100 అడుగుల వెడల్పు కారిడార్‌లో ప్రస్తుతం 30 అడుగుల స్థలం ఖాళీగా ఉందని, దానిని బైపాస్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయి రహదారి నిర్మాణానికి మరో 70 అడుగులు అవసరం ఉంది. ఆ భూమి సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోయినా పనులు ప్రారంభించడంపై స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శంకుస్థాపన చేసిన స్థలం నుంచి మళ్లిన బైపాస్ రోడ్డు డిజైన్
భూములు నష్టపోతున్నామని అన్నదాతల ఆందోళన
భూసేకరణ, పరిహారం లేకుండానే పనులు చేస్తున్నారని ఆరోపణలు
నిరసన వ్యక్తం చేస్తున్న పెద్దకల్వల, అప్పన్నపేట గ్రామాల రైతులు


