పీఆర్పీపై సింగరేణి పేచీ | - | Sakshi
Sakshi News home page

పీఆర్పీపై సింగరేణి పేచీ

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

గోదావరిఖని: సింగరేణి అధికారుల పీఆర్‌పీ(పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే) చెల్లింపులపైనే ప్రధానంగా పేచీ కొనసాగుతోంది. మూడేళ్లలో అధికారులకు రావాల్సిన సుమారు రూ.394 కోట్ల కోసం వారు నాలు గు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాస్తవానికి ప్రతీఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించే లాభాల్లో వాటాను వచ్చే ఏడాది జూన్‌లో చెల్లిస్తారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం అధికారులకు రూ.117కోట్లు పీఆర్‌పీ ప్రకటించింది. వీటిని 2024 జూన్‌లోగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గడిచిన మూడేళ్లలో ఇదేవిధంగా పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. కోలిండియా యాజమాన్యం రెండేళ్ల పీఆర్‌పీ సొమ్మును అధికారులకు చెల్లించింది. సింగరేణిలో మూడేళ్లుగా చెల్లింపులు నిలిచిపోవడంతో అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పీఆర్‌పీ అంటే..

కోలిండియా యాజమాన్యం తమ అధికారులకు లాభాల్లో వాటా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సింగరేణి యాజమాన్యం కూడా అధికారులకు పీఆర్పీ చెల్లించడం తప్పనిసరైంది. ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో వచ్చిన లాభాలపై 5శాతం అధికారులకు పీఆర్పీ చెల్లిస్తూ వస్తోంది. దీనినే ఆపరేషనల్‌ ఫ్రావిట్‌ అని కూడా అధికారులు పేర్కొంటున్నారు. మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పేమెంట్‌(పీఆర్‌పీ) అధికారు లకు అందాల్సి ఉంది. వీటిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్పీ కోలిండియా యాజమాన్యం కూడా అధికారులకు ఇంకా చెల్లించలేదు. అయినా.. జూన్‌లోనే చెల్లించాల్సి ఉంది.

అధికారుల్లో అసంతృప్తి

పీఆర్పీ చెల్లింపు నిలిచిపోవడంతో అధికారుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. సంస్థ వ్యాప్తంగా సుమారు 2,200మంది అధికారులు పనిచేస్తుండగా.. ఒక్కో అధికారికి సీనియార్టీ ప్రకారం ఒక్కో ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.6లక్షల వరకు పీఆర్పీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న తమను పీఆర్పీ చెల్లించకుండా యాజమాన్యం చిన్నచూపు చూస్తోందని అధికారులు వాపోతున్నారు. ఈ – వన్‌ గ్రేడ్‌ నుంచి ఈ–8 గ్రేడ్‌ వరకు పీఆర్పీ ఇవ్వాల్సి ఉంది.

అధికారులకు అందాల్సిన సొమ్ముపై తీవ్ర నిర్లక్ష్యం

మూడేళ్లుగా చెల్లించని బొగ్గు గనుల సంస్థ

నాలుగు రోజులుగా కొనసాగుతున్న అధికారుల నిరసన

పీఆర్పీ బకాయిలు(రూ.కోట్లలో)

2022–23 117

2023–24 127

2024–25 150

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement