కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరవాసులు సురక్షితంగా నడిచేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి రోడ్ల వెంట నిర్మించిన ఫుట్‌పాత్‌లు క్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా బల్దియా కార్యాలయం నుంచి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు మెయిన్‌రోడ్డు వెంట రూ.1.60 కోట్లతో నిర్మించిన ఫుట్‌పాత్‌లు వ్యాపారాలకు అడ్డాగా మారుతున్నాయి. చర్యలు చేపట్టాల్సిన బల్దియా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్ట్రీట్‌ఫుడ్ కేంద్రాలకు అడ్డగా..
గోదావరిఖని గాంధీనగర్‌లోని ప్రధాన రహదారికి ఇరువైపులా, నగరంలోని ప్రధాన రహదారుల వెంటఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుంటున్న వ్యా పారులు, వాటిపై ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ, టిఫిన్ సెంటర్లతోపాటు కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు, రెడిమేడ్ దుస్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల వ్యాపారులు టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేసి ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమిస్తున్నారు.
కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందులు
ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాల రద్దీ మధ్య ప్రయాణించడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వేళల్లో వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతోంది.
మొక్కుబడిగా తొలగింపులు..
అధికారులు మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నప్పటికీ తాత్కాలికంగానే మిగులుతున్నాయి. అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ ఆక్రమణలు పునరావృతమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఫుట్‌పాత్‌లు పాదచారులకు కాకుండా వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
రూ.1.60 కోట్ల లక్షల ప్రజాధనం వృథా
వ్యాపారులకు అడ్డాగా మారిన వైనం
చోద్యం చూస్తున్న బల్దియా, పోలీస్ శాఖ


