స్పందించని సింగరేణి.. పోరుబాటే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

స్పందించని సింగరేణి.. పోరుబాటే శరణ్యం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

● మూడేళ్ల పీఆర్‌పీ చెల్లించాలి ● పదోన్నతి పాలసీ రూపొందించి అమలు చేయాలి ● పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు ఉండాలి ● సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండవద్దు ● సంస్థకు రూ.50వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి ● అధికారుల క్వార్టర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి ● అధికారుల ఐఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించాలి

గోదావరిఖని: అధికారులు పోరుబాట పట్టారు. అయినా యాజమాన్యం స్పందించడంలేదు. దీంతో అధికారులు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే అన్నిఏరియాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నుంచి జీఎం కార్యాలయాల ఎదుట రిలేనిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం అన్ని ఏరియాల అధికారులకు ఆ సంఘం ఆదేశాలు జారీ చేసింది. రిలే నిరాహార దీక్షలు చేపట్టినా స్పందించక పోతే వర్క్‌టూ రూల్‌ ప్రారంభిస్తామని హెచ్చరిస్తోంది. సంస్థ వ్యాప్తంగా సుమారు 2,200మంది అధికారులు పనిచేస్తున్నారు. వీరందరికీ 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్‌పీ చెల్లించాలని, వీటిలో రెండేళ్ల బకాయిలు సుమారు రూ.277కోట్లు రావాల్సి ఉందని అంటోంది. మరోఏడాది లెక్క తేలాల్సి ఉందంటున్నారు. సొంత సంస్థగా భావించి అభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమను యాజమాన్యం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సింగరేణి అధికారులు ఉన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

దశల వారీగా ఆందోళనలు

సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు అధికారులు పిలుపునిచ్చారు. తొలిదశలో కార్మికవాడల నుంచి జీఎం కార్యాలయాలవరకు ఆందోళన నిర్వహించారు. జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. రెండోశలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అయినా యాజమాన్యం స్పందించక పోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రిలే నిరాహార దీక్షలకు స్పందించకపోతే ప్లేడేలు బాయికాట్‌ చేయడం, వర్క్‌ టూ రూల్‌ పాటించనున్నట్లు సింగరేణి అధికారుల సంఘం ప్రకటించింది.

సంస్థ కోసం శ్రమిస్తున్నాం

సింగరేణి కోసం ఇళ్లు వదిలి అహర్నిశలు శ్రమిస్తున్నాం. సకాలంలో పీఆర్‌పీ బకాయిలు చెల్లించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. అనేక విధాలుగా ఆందోళన నిర్వహించాం. యాజమాన్యం స్పందించక పోవడం బాధగా ఉంది. అధికారులకు రావాల్సిన పీఆర్‌పీతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించాలి.

– పెద్ది నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ

వర్క్‌టూ రూల్‌కు సిద్ధమైన అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement