పెద్దపల్లిరూరల్: మీరు కన్నపిల్లలపై మమకారం పెంచుకుని వారి భవిష్యత్ బాగుండాలనే ఆలోచనతో ఆస్తులను వారికి అప్పగిస్తే.. ఆస్తులు తీసుకొని గెంటేయడం బాధాకరమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని వృద్ధాశ్రమంలో సోమవారం వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. కాసేపు ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన గొర్రె కొమురమ్మ తన భర్త పోచమల్లు సింగరేణి కార్మికుడిగా పనిచేసి ఆ ఉద్యోగాన్ని తన పెద్దకొడుకు కుమార్‌కు ఇప్పించారని తెలిపారు. ఆ సమయంలో కుటుంబ బాగోగులతో దివ్యాంగులైన తన ఇద్దరు కుమారుల బాధ్యతలు చూసుకుంటానని నమ్మించి మోసం చేసాడని జడ్జి సునీత ఎదుట వాపోయింది. తనకు పోషణ ఖర్చులు ఇప్పించాలని జడ్జిని వేడుకుంది. కుమారుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేస్తామని జడ్జి తెలిపారు. కార్యక్రమంలో రాఘవాపూర్ సర్పంచ్ తాడిచెట్టి చామంతి, న్యాయవాది సత్యనారాయణరెడ్డి, వృద్ధాశ్రమ ట్రస్టు సభ్యులు అశోక్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజయ్యతో పాటు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులున్నారు.


