బన్నీ వేసవి యాత్ర–8 | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర–8

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

బురదలో కాలు

పాలు తాగాక తాతయ్య బయటకు వెళ్లి,

‘బన్నీ రారా’ అని పిలిచాడు.

బన్నీ వెళ్లాడు. చుక్క, రామ్‌ కూడా వచ్చారు.

పొలం గట్టు.

కింద నీళ్లు. నీళ్లలో బురద.

పచ్చగా వరి నాట్లు.

తాతయ్య చెప్పాడు, ‘ఇదే మన పొలం.

ఇక్కడే అన్నం పుడుతుంది.’

బన్నీకి ఆశ్చర్యం.

‘బియ్యం షాప్‌ నుండి తెస్తారు కదా తాతయ్యా?’

తాతయ్య నవ్వాడు.

‘లేదు రా. మొదట ఇక్కడే.

ఈ బురదలో వంగి పని చేస్తేనే, మనం తలెత్తుకు తినగలం.’

బన్నీకి వివరంగా తాతయ్య చెప్పాడు.

బన్నీ గట్టు మీద నడుస్తున్నాడు.

అడుగు జారింది.

‘భళ్లున’ బురదలో పడ్డాడు.

కాలు మోకాలు వరకు దిగింది.

బన్నీకి భయం వేసింది . ‘అమ్మా !’ అని అరిచాడు.

చుక్క పరిగెత్తుకు వచ్చింది.

‘భయం వద్దు బన్నీ’ అంది.

చెయ్యి ఇచ్చింది.

బన్నీ చుక్క చెయ్యి

పట్టుకున్నాడు.

చుక్క గట్టిగా లాగింది.

రామ్‌ కూడా సాయం చేశాడు.

బన్నీ బయటికి వచ్చాడు.

కాలు అంతా బురద.

కానీ మనసులో నవ్వు.

చుక్క అంది, ‘చూశావా?

ఆపదలో ఉన్నవాడికి చెయ్యి అందించడమే స్నేహం.’

తాతయ్య బన్నీ తల నిమిరాడు.

‘ఇప్పుడు తెలిసిందా? అన్నం విలువ.’

కష్టపడితేనే పంటలు పండుతాయి. ఆ పంట నుండే తిండి గింజలు వస్తాయి.

పిల్లలకి మాట:

కష్టం తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది.

స్నేహం అంటే కష్టంలో చెయ్యి అందించడం.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి,

మండలం: మంథని,

పెద్దపల్లి జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement