జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రత కరువు కనీస సౌకర్యాలు లేని భవనాల్లో ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు అలంకారప్రాయంగా అగ్నిమాపక యంత్రాలు
సాక్షి పెద్దపల్లి:
రోగులను పట్టిపీడిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రాణాలు కాపాడండి అంటూ వెళ్లేవారికి రక్షణ చర్యలు లేకుండా పోయా యి. జిల్లాలో రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య పెరుగుతుండగా, చాలా ఆస్పత్రుల్లో ఏదేని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోగుల రక్షణకు కనీస భద్రత చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నాయి.
కనీస సౌకర్యాలు కరువు
జిల్లాకేంద్రంలో ఉన్న చిన్నాపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి రెండు మినహా మిగతా వాటిల్లో కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. చాలా ఆస్పత్రులకు వాహన పార్కింగ్ స్థలం కూడా లేకపోవడం గమనార్హం. ఇరుకు రోడ్లు, సందుల్లోనూ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే దారి కూడా లేదు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులతోపాటు, వారి అటెండెంట్లు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
జిల్లాలో నిబంధనల మేరకు ఆస్పత్రులు ఏర్పాటు చేయడం లేదు. కార్లు వెళ్లలేని గల్లీల్లో పదుల సంఖ్య లో ఆస్పత్రులు వెలిశాయి. ఇరుకు భవనాల్లో ఏర్పా టు చేయడంతో రోగుల గదులకు గాలి, వెలుతురు రాని పరిస్థితి నెలకొంది. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజిన్ భవనం చుట్టూ తిరిగి మంటలార్పేలా ఏర్పాట్లు ఉండాలి. ప్రమాద సమయంలో ఒకదారి మూసుకుపోతే మరోదారిన రోగులు బయటకు వచ్చే విధంగా మెట్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఏ ఆస్పత్రిలో చూసిన ఒకవైపు మెట్లే దర్శనమిస్తుండగా, ర్యాంపులు సైతం ఉండటం లేదు.
నోటీసులతోనే సరి..?
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రులు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే రోగుల ప్రాణాలకు ముప్పు తప్పదనే భయం నెలకొంది. పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిలో చాలా ఆస్పత్రులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తగిన పార్కింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విశాలమైన మెట్లు, వెంటిలేషన్ వంటి సదుపాయాలు లేకుండానే నడుస్తున్నాయి. కొన్నిచోట్ల ఓపీ గదులు, ఇన్‌పేషెంట్ వార్డులు, డాక్టర్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లు ఇరుకుగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆరు నెలల క్రితం పెద్దపల్లి పట్టణంలోని ఓ ఆస్పత్రి సెల్లార్‌లోనే వైద్య సేవలు నిర్వహిస్తున్న విషయం అప్పటి డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలో బయటపడింది. అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాహకులు కార్యకలాపాలు నిలిపివేశారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్‌ను వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చిత్రంలో అలంకారప్రాయంగా కనిపిస్తున్న అగ్నిమాపక యంత్రం గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనిది. ఈ ఒక్కటే కాదు చాలా ఆస్పత్రుల్లో పరిస్థితి ఇలాగే ఉంది. యంత్రాలపై ఫిల్లింగ్ తేదీ, గడువు తేదీ, తదుపరి సర్వీస్ వివరాలు కనిపించవు. కొన్నింటిపై సర్వీస్ స్టిక్కర్లు లేకపోగా, మరికొన్నింటిపై ఎప్పుడు రీఫిల్ చేశారన్న సమాచారం శూన్యం. సంబంధిత అధికారులు తనిఖీలు చేయాల్సి ఉండగా.. అటువైపు చూసేవారే లేరు.


