కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, వైద్య సిబ్బందికి గురువారం రామగుండం నగరపాలక సంస్థలోని సమావేశ మందిరంలో అసంక్రమిత వ్యాధుల కార్యక్రమం (ఎన్‌సీడీ)తోపాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన డీఎంహెచ్‌వో కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌సీడీ స్క్రీనింగ్ రెండో దశ ఆన్‌లైన్ ఎంట్రీలను త్వరితగతిన నమోదు చేయాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఓపెన్ వైయల్ పాలసీని కచ్చితంగా పాటిస్తూ, ఈ–విన్ పోర్టల్‌లో రియల్ టైమ్ డేటా నమోదు చేయాలని సూచించారు. గర్భిణులకు నాలుగు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలు అందించాలన్నారు. పట్టణ ప్రాంత గర్భిణీలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలోనే ప్రసూతి సేవలు పొందేలా ప్రోత్సహించాలని, ఇందులో సూపర్వైజర్ల పాత్ర కీలకమన్నారు. వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రోగ్రామ్ అధికారులు రాజమౌళి, బి.కిరణ్ కుమార్, డీడీఎం మహేందర్, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ టి.రాజేశ్, పాల్గొన్నారు.
బడిబాట విజయవంతం
పెద్దపల్లి: జిల్లాలో బడిబాట విజయవంతమైందని డీఈవో శారద తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక– విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 510 పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించామని తెలిపారు. ఇందులో 4,395 మంది తల్లిదండ్రులు, 534 మంది పూర్వ విద్యార్థులు, 771మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా జిల్లాలో 128 కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్యా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వీటిలో 2,122 మంది విద్యార్థులు పాల్గొని ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో 68 వంటల పోటీలు నిర్వహించామన్నారు.
పబ్లిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి: 2026–27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్‌లోని బేగంపేట్ పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఈనెల 29లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్యలో జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రూ.2లక్షలు, రూరల్ ప్రాంతంలో రూ.1.50లక్షల లోపు ఉండాలని, ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారితో అటెస్టడ్ చేసి ఈనెల 29 సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. జూన్ 1న లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
అంతర్జాతీయ వేదికపై రెస్క్యూ టీం సత్తా
గోదావరిఖని: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి తెలుగు ఖ్యాతి ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఘనత సింగరేణి రెస్క్యూకి దక్కిందని ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ పేర్కొన్నారు. జాంబియా దేశంలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సత్తాచాటిన సింగరేణి బృందాన్ని గురువారం రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి, జీఎం అభినందించారు. గనుల రక్షణలో అత్యంత కీలకమైన అండర్‌గ్రౌండ్ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. సింగరేణి నుండి ఇద్దరు అధికారులు అంతర్జాతీయ జడ్జిలుగా వ్యవహరించడం గొప్ప విషయం అన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఏజీఎం రామమోహనరావు, డాక్టర్ రాజేశ్వర్ రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పాల్గొన్నారు.


