వెడల్పు 50 ఫీట్లా.. 60 ఫీట్లా! | - | Sakshi
Sakshi News home page

వెడల్పు 50 ఫీట్లా.. 60 ఫీట్లా!

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

● మెయిన్‌ రోడ్డు విస్తరణపై రాని స్పష్టత ● వ్యాపారులతో మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌ సమావేశం

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లిలో ప్రధాన వ్యాపారకూడలిగా ఉన్న జెండాచౌరస్తా, మెయిన్‌రోడ్డు ఇరుగ్గా మారింది. పాదచారులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రోడ్డు విస్తరణ చేపట్టే విషయమై వ్యాపారులు, మున్సిపల్‌ అధికారుల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. మెయిన్‌ రోడ్డును 66 ఫీట్లుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించగా, వ్యాపారుల నుంచి విముఖత వ్యక్తమైంది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కమల్‌కిషోర్‌ శారడ, స్థానిక కౌన్సిలర్‌ మంథని నర్సింగ్‌ తదితరులతో కలసి వ్యాపారులంతా ఎమ్మెల్యే విజయరమణారావును కలిసి తమకు జరిగే నష్టంపై మొరపెట్టుకున్నారు. మున్సిపల్‌ అధికారులు, వ్యాపారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని ఎమ్మెల్యే సూచించారు.

రోడ్డు విస్తరణపై రాని స్పష్టత

పెద్దపల్లి మున్సిపల్‌ ఆఫీసులో గురువారం పట్టణంలోని మెయిన్‌రోడ్డు వ్యాపారులతో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌ సమావేశమయ్యారు. ప్రజల అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. 66ఫీట్లు కాకుండా కనీసం 60ఫీట్లు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. 60ఫీట్లు విస్తరించే తమకు చాలా నష్టం కలుగుతుందన్న వ్యాపారులు 50ఫీట్లు చేస్తే అభ్యంతరం లేదన్నారు. 60ఫీట్లు విస్తరిస్తేనే రాకపోకలకు, వాహనపార్కింగ్‌, డ్రైనేజీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని మున్సిపల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

రద్దీకి అనుగుణంగా విస్తరించాలి

పెద్దపల్లి జిల్లాకేంద్రం. ఆ హోదాకు తగ్గట్టుగా ప్రధాన వ్యాపారకూడలిగా ఉన్న మెయిన్‌రోడ్డును విస్తరిస్తేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా పెరుగుతున్న జనాభా, వాహన వినియోగంతో మెయిన్‌రోడ్డులో పాదచారులు నడవలేని, వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చేపట్టే విస్తరణతో భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవడమే మేలని పలువురు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణలో ఎక్కువ మొత్తంలో నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించాలని, ట్రాఫిక్‌ పరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement