ధాన్యం తరలింపులో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపులో జాప్యం వద్దు

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథని/మంథనిరూరల్‌: ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథని మండలం పుట్టపాకలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, మంథని మార్కెట్‌ యార్డును గురువారం సందర్శించారు. ప్రస్తుతం రోజుకు 70లారీలే అందుబాటులో ఉన్నాయని, మరో 30నుంచి 40లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు సమీపంలోనే రైస్‌మిల్లులు ఉంటే ట్రాక్టర్ల ద్వారా తరలించాలన్నారు. అనంతరం మంథని మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డులో జరుగుతున్న జనాభా లెక్కలను పరిశీలించారు. మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివిధశాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీని వాస్‌, వైస్‌ చైర్మన్‌ సహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, పీఏసీఎస్‌ సీఈవో మామిడాల అశోక్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. టెండర్‌ దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సింగరేణి అవసరాలకు భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో అవసరం లేని రహదారి విస్తరణ పనులను ప్రోత్సహించవద్దని తెలిపారు. మెడికల్‌ కళాశాల పనులను పూర్తి చేయాలని, మంథని గెస్ట్‌ హౌస్‌ను 9నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.

వ్యవసాయ అవసరాలకే చెరువు మట్టి

చెరువుల్లోని సారవంతమైన మట్టిని వ్యవసాయ భూములకు తరలించేందుకు ఆసక్తి గల రైతులు రేపటి నుంచి సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. నీరు లేని చెరువుల నుంచి మట్టిని వ్యవసాయ భూములకు తరలించుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు చెరువు మట్టిని ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఇతర అవసరాలకు మళ్లించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement