అక్రమాలకు కేంద్రాలు! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు కేంద్రాలు!

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

మంథని/మంథనిరూరల్‌: రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. స్థా నిక రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు అక్రమాలకు తెరలేపుతున్నారు. మహారాష్ట్రలోని సిరొంచలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను బినామీలుగా చూపుతూ రైస్‌మిల్లుకు తరలించిన తతంగం ఇటీవల వెలుగు చూసింది.

రైతులను బినామీగా చూపుతూ..

రైతులను బినామీలుగా చూపుతూ అక్రమార్కులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులో ఉన్న సిరోంచ ప్రాంతంలో టెండర్‌ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు. క్వింటాల్‌కు రూ.1200 నుంచి రూ.1500 వరకు పలుకుతుంది. ఇటీవల అక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సుల్తానాబాద్‌లోని ఓ రైస్‌ మిల్లుకు మంథని మండలం మల్లేపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల పేరిట ట్రక్‌షీట్‌ నమోదుచేసి తరలించిన ఘటన వెలుగు చూసింది. ఆ ధాన్యం నాసిరకంగా ఉందని రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేయకుండా ఆపేశారు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకుండా ఆగిపోయాయి. విషయం బయటపడటంతో అధికారులు రంగంలోకి దిగారు. మల్లేపల్లి కేంద్రంగా ఎనిమిది లారీల ధాన్యాన్ని తరలించినట్లు తేలడంతో, ఇతర కొనుగోలు కేంద్రాలపై సైతం దృష్టి సారించారు. మరో ఐదు సెంటర్లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం.

రూ.కోట్లలో వ్యాపారం

మహారాష్ట్రలో టెండర్‌ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లుకు తరలించే వరకు క్వింటాల్‌కు సుమారు రూ.2000 పలుకుతుంది. రవాణా, ఇతర ఖర్చులు పోనూ క్వింటాల్‌కు రూ.400 చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. మల్లేపల్లి కేంద్రం నుంచి బినామీ రైతుల పేరిట ఎనిమిది లారీలను రైస్‌మిల్లుకు తరలించిన వ్యవహారంలో సుమారు రూ.10లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క మల్లేపల్లి కేంద్రంలోనే ఎనిమిది లారీల బాగోతం బయటపడితే జిల్లావ్యాప్తంగా రెండు వందలకు పైగా ఉన్న కొనుగోలు కేంద్రాల ద్వారా అక్రమార్కులు రూ.కోట్ల దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న విచారణ

బినామీ రైతుల పేరిట ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించిన వ్యవహారంలో అధికారులు పురోగతి సాధించినట్లు సమాచారం. మల్లేపల్లి నుంచి ఎనిమిది లారీల ధాన్యాన్ని బినామీ రైతుల పేరిట రైస్‌మిల్లుకు తరలించినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఆ ఒక్క కేంద్రమే కాకుండా మరికొన్ని కేంద్రాల్లోనూ అక్రమాలు వెలుగుచూస్తుండటంతో అధికారులు మరిన్ని నిజాలు బయటపెట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట ధాన్యం తూకంలో కోత విధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సైతం అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది.

సిరోంచ నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం

రైతులను బినామీలుగా చూపుతూ మిల్లులకు తరలింపు

వెలుగు చూస్తున్న కుంభకోణం.. ఆందోళనలో అన్నదాతలు

కొనసాగుతున్న అధికారుల విచారణ

Advertisement
 
Advertisement
Advertisement