ప్రభుత్వ ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సులతో పాటు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం పాలిసెట్ అర్హత పరీక్ష నిర్వహించారు. పరీక్ష పగటిపూట ఉండడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఎండ ముందస్తు పరీక్ష పెట్టింది. మిట్ట మధ్యాహ్నం 11 గంటల నుంచి 1.30 వరకు పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిలువ నీడలేక పరీక్ష ముగిసేవరకు చెట్ల కింద సేదతీరుతూ ఉక్కపోతతో విలవిల్లాడారు. ఎండలో అవస్థలు పడుతూ చల్లదనం కోసం చెట్ల కింద సేదతీరుతూ కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బుధవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఆరు పరీక్షా కేంద్రాల్లో 2,333 మందికి 2200 మంది పరీక్ష (94.29శాతం) రాశారని కో ఆర్డినేటర్ లక్ష్మినర్సయ్య తెలిపారు. 133 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. కొంత మంది విద్యార్థులు వెంట పెన్సిల్ తెచ్చుకోక హైరానా పడగా పరీక్షల కోఆర్డినేటర్ అందించారు. పరీక్షా కేంద్రాలను రాష్ట్ర ఆబ్జర్వర్ కిరణ్‌కుమార్ సందర్శించారు. కేంద్రంలోకి గంట ముందు నుంచే విద్యార్థులను లోపలికి అనుమతించారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి తనకు కేటాయించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వచ్చాడు. సెంటర్‌కు పొరపాటున వచ్చానని, ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్లేదెలా.. అంటూ వేదనకు గురవుతుండడాన్ని పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వస్తున్న ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నవీన్‌రావు గమనించాడు. విషయం తెలుసుకుని పరీక్షకు 8నిమిషాలే గడువు ఉండడంతో తన బైక్‌పై సెంటర్ వద్ద దింపడంతో కృతజ్ఞతలు తెలిపాడు.
94.29శాతం మంది హాజరు


