పెద్దపల్లి, సాక్షి/పెద్దపల్లి: రైతులకు సాగునీరు అందించే, మత్స్యకారులకు ఉపాధి కల్పించే చెరువులను కొందరు ఇటుకబట్టీ యజమానులు చెరబడుతున్నారు. ఇటుకల తయారీకి బంకమట్టి వినియోగిస్తారు. జిల్లావ్యాప్తంగా పలు చెరువుల్లో బంకతోకూడిన నల్లరేగడి మట్టి లభిస్తోంది. ఈక్రమంలో రెండు చెరువుల్లో బంకమట్టి తవ్వకాల కోసం ఇటుకబట్టీ యజమానులు ఇటీవల దరఖాస్తు చేశారు. ఇందు లో పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల మధ్యలోని కొదురుపాక గ్రామ శివారులోని సర్వే నంబర్ 805లో 76.19ఎకరాల్లో విస్తరించిన ఎల్లమ్మ చెరువు ఉంది. ఇందులో 28వేల క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకాల కోసం అనుమతి ఇవ్వాలని విన్నవించారు. అ క్కడి వరకు సవ్యంగానే ఉన్నా, అనుమతులు పొందటానికి చెరువు నీటిని ఖాళీ చేసేందుకు తూముకు గండికొట్టారు. ఈ విషయంపై మత్య్సకారులు ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగంతోపాటు రాజకీయ నేతల అండదండలు ఉండడంతోనే ఇటుకబట్టీ యజమానులు ఇలా బరితెగించినట్లు కొదురపాక గ్రామస్తులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
మట్టి కోసం రెండు దరఖాస్తులు..
ఇటుకబట్టీ యజమానులు ముత్తారం మండలంలో ఒకటి, సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక ఎల్లమ్మ చెరువులో బంకబట్టి తీసుకెళ్లేందుకు అధికారులకు ఇటీవల దరఖాస్తు చేశారు. అనుమతి కోసం కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. సీనరేజీ చెల్లించి, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతి తీసుకుని వాల్టా మేరకు తవ్వకాలు చేపట్టాలి. దీనిని ఆసరాగా చేసుకుని జిల్లాలో ఏటా వేసవిలో నామమాత్రపు అనుమతితో పలు చెరువుల్లో మట్టి లూటీ చేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్న చెరువుకే అక్రమార్కులు ఏకంగా గండికొట్టారు. ఇందుకు అధికార యంత్రాగం ఎలా సహకరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
చేపలు పడుతున్న మత్స్యకారుడు
చెరువు తూము ధ్వంసం చేసి.. నీళ్లు వదిలేసి..
మట్టి తవ్వకాల కోసం అక్రమార్కుల ఆగడాలు
కొదురుపాక చెరువుకు ఇటుకబట్టీ నిర్వాహకుల టెండర్
ఉపాధి దెబ్బతీస్తున్నారంటున్న మత్స్యకారులు, గ్రామస్తులు
చెరువుల్లో చేపల వేట
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూముల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వారు. అందులో పెంచే చేపలకు కోళ్ల వ్యర్థాలను దాణాగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందులోని వరద ప్రాజెక్టులోకి చేరడంతో నీరు కలుషితమవుతందని అధికారులకు ఫిర్యాదు అందాయి. స్పందించిన ఉన్నతాధికారులు.. చెరువులను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీచేశారు. పొట్యాల, సోమనపల్లి, ముర్మూరులో చేపల చెరువులు ఉన్నాయని, వాటిలోని చేపలు పట్టుకొని చెరువులు పూడ్చివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మత్స్యకారులు చేపలు పట్టుకుని వ్యాన్‌లో తరలించేందుకు సిద్ధమయ్యారు. సొంత స్థలంలో ఫిషరీష్ అధికారుల అనుమతులతో సోమనపల్లి, ముర్మూర్ గ్రామాల్లో చెరువులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.


