రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శని వారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. వేసవి దృష్ట్యా జిల్లావాసులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నీటినిల్వలపైనా చర్చించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.22 టీఎంసీల నీరు ఉందని అధికారులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత నీటి నిల్వలతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని వివరించారు.
రాగినేడులో ప్రత్యేక పూజలు
పెద్దపల్లిరూరల్: రాగినేడులోని స్వయంభూ శ్రీనాగలింగేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వేదపండితులు హోమయజ్ఞం, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దామోదర్ హాజరయ్యారు. రాగినేడుతోపాటు పెద్దపల్లి, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంత రం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సోమకుమార్, గుమ్మడి విజయ్, కోలేటి రమేశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక
రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మూడో తరగతి విద్యార్థి కత్తెరమల్ల శ్రేణిక్ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. ఈమేరకు ఎంఈవో ముక్కెర సంగీత శనివారం శ్రేణిక్‌ను అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యేందుకు కృషి చేసిన పీఈటీ తిరుపతికి సంగీత కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా మాస కల్యాణం
కమాన్‌పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి మా స కల్యాణమహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భ క్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్య క్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్లు బొజ్జ సతీశ్, తీగల రాజయ్య, కొంతం శ్రీనివాస్, కుందారపు శంకర్ పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
రామగుండం: సివిల్, రైల్వే, ప్రభుత్వ రైల్వే పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గంటపాటు ప్రయాణికుల రాకపోకలు పరిశీలించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల ఆధార్‌కార్డులపై ఆరా తీశారు. అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి రవాణాకు రైళ్లను ఎంచుకుంటుండడంతో తనిఖీలు చేశామని రామగుండం సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
ఎప్‌సెట్ ప్రారంభం
రామగిరి: మంథని జేఎన్టీయూలో శనివారం ఎప్‌సెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మూ డు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. తొలిరోజు ఉదయం 90మందికి 84 మంది, మధ్యాహ్నం 90 మందికి 83మంది పరీక్షకు హాజరయ్యారు. మెకానికల్ ప్రొఫెసర్ చెరుకు శ్రీధర్‌రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.


