పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆరు ట్యాంకులు ఉండగా.. ఆర్డీవో కార్యాలయలో 8 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ట్యాంకును కూల్చివేశారు. అక్కడ 14.50లక్షల లీటర్ల సామర్థ్యంతో కొత్త ట్యాంకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదింటిద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ట్యాప్‌ల ద్వారా ఇళ్లకు నీటిని అందించే మెయిన్ పైప్‌లైన్లు తరచూ పగుళ్లు చూపుతున్నాయి. కొన్నిప్రాంతాలకు కలుషితనీరు సరఫరా అవుతోంది.
నీళ్లు రాక ఇబ్బందులు
మేం అద్దె ఇంట్లో ఉంటున్నం. మూడ్రోజుల నుంచి నీళ్లు రావడంలేదు. బోరుబావి నీళ్లు మోసుకొస్తూ ఇబ్బంది పడుతున్నం. అధికారులు రోజూ నీళ్లు సరఫరా చేయాలె.
– అయేషా, సుభాష్‌నగర్
వాసనొస్తున్నయ్
నల్లాల నుంచి రోజువిడిచి రోజు నీళ్లు వస్తున్నయి. ఎంతసేపు, ఎప్పుడు వస్తయో తెల్వదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లు దుర్వాసనతో ఉంటున్నయ్. అధికారులు మంచినీళ్లు సరఫరా చేయాలె.
– కంది కనకయ్య, మల్లమ్మ, సాగర్‌రోడ్డు


