ప్రిడిక్షన్ పేరు టెలిగ్రామ్ గ్రూప్‌లతో ఏర సరదాగా మొదలై వ్యసనంగా మారి అప్పుల ఊబిలోకి పందేలకు ప్రాణాలు పణంగా పెడుతున్న యువత బెట్టింగ్ భూతానికి రెండేళ్లల్లో ముగ్గురు బలి
30 ఏళ్లలోపు వయసు వారి విషయంలో కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి ఎవరైనా కొత్తవారొస్తే వివరాలు తెలుసుకోవాలి.
మ్యాచ్‌ల సమయంలో వారు బయటకు వెళ్తున్నారా. ఏ సమయంలో వస్తున్నారు? రోజూ అలాగే జరిగితే ఆరా తీయాలి.
ఇంట్లో డబ్బులు అడుగుతున్నారా? దేనికోసం అడుగుతున్నారు? వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? అనే విషయాలపై నిఘా ఉండాలి.
క్రికెట్ పోటీలు ఉన్న సమయంలో చదువు మీద ఆసక్తి పెట్టలేకపోవడం కనిపిస్తే కూర్చోబెట్టుకుని మాట్లాడాలి.
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న దృష్ట్యా మొబైల్‌లో తరుచూ ఆ విషయమై మాట్లాడుతూ ఉంటే అనుమానించాలి.
ఐపీఎల్ సమయంలో కొత్త సిమ్ తీసుకుంటే కారణం తెలుసుకోవాలి.
‘రామగుండంకు చెందిన ఓ విద్యార్థి బాగా చదువుతాడని మంచి పేరుంది. క్రికెట్ మీద ఉన్న మోజుతో సోషల్‌మీడియాలో వచ్చే ప్రిడిక్షన్ యాడ్స్‌తో టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాడు. బెట్టింగ్‌లో రూ.వందకు వెయ్యి, రూ.వెయ్యికి రూ.10వేలు వస్తాయని ఆకర్షితుడయ్యాడు. ఒకట్రెండు సార్లు డబ్బులు రావడంతో ఇంకా ఉత్సాహంగా పెట్టాడు. క్రమంగా అప్పుల్లో మునిగిపోయి తీర్చలేనని తెలిసి ప్రాణం తీసుకున్నాడు. ఇలా జిల్లాలో రెండేళ్లలో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. మరెందరో తెలిసిన వారి దగ్గర అప్పు చేసి, తమ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ కుదవబెట్టిన ఘటనలూ ఉన్నాయి.
సాక్షి పెద్దపల్లి: బంతి బంతికి ఉత్కంఠ, క్షణాల్లో మారిపోయే ఫలితం, ఆద్యంతం ఉద్విగ్నత, కావాల్సినంత వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆటను వినోదంలా కాకుండా కొంతమంది యువకులు బెట్టింగ్‌లు కాస్తూ అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ దందా.. టెలిగ్రామ్, వాట్సప్ గ్రూప్‌లతో పల్లెల్లోకి విస్తరించింది. పట్టణాల్లోని కేఫ్‌లు, టీకొట్టుల వద్ద యువతకు బెట్టింగ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. వీరిని నియంత్రించే వ్యక్తిని డాన్ అంటారని, వారు ఎవరు, ఎక్కడ ఉంటారు? వారి నేపథ్యం ఏజెంట్లకు కూడా తెలియదని సమాచారం. జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మ్యాచ్‌కు గంట ముందు నుంచే గ్రూప్‌ల ద్వారా బెట్టింగ్‌లు ప్రారంభమవుతుంటాయి. అందుకోసం యువత కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసుకుని ఆ నంబరు ద్వారా ఏజెంట్లను సంప్రదిస్తూ బెట్టింగ్ కాస్తుంటారు. టాస్ వేసినప్పటి నుంచి చివరి ఓవర్ వరకు ఈ ప్రక్రియ సాగుతుంది.
ప్రిడిక్షన్ పేరుతో టెలిగ్రామ్ గ్రూప్స్
అసలే ఎండకాలం.. సెలవులకాలం కావడంతో యువత ఇంటి వద్ద ఉంటూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా శ్రీఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడో ముందే చెబుతాం.. జస్ట్ మీరు మా టెలీగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలుశ్రీ అంటూ లింక్స్‌తో ఎర వేస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌పై మోజుతో ఆయా లింక్స్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్‌లలో జాయిన్ అయి తెలియకుండానే బెట్టింగ్ భూతం బారిన పడుతున్నారు. సరదాగా మొదలై చివరికి వ్యసనంగా మారి అప్పుల పాలై ఆత్యహత్య చేసుకుంటున్నారు.
కేసులు నమోదైతే చిక్కులే
గతంలో బెట్టింగ్‌లో పట్టుబడితే వారిపై సానుభూతి(పెట్టి) కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు పూర్తి వివరాలుంటాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సమయంలో లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. అంతేగాకుండా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేద్దామని భావించినా నేరచరిత ఉందని భావించి తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్‌ను పోలీస్‌శాఖ ఆన్‌లైన్ చేయడంతో ఎక్కడ బెట్టింగ్ జరిగినా ఇప్పటికే దొరికినవారిపై నిఘా ఉంటుంది. ఇలా నాలుగుసార్లు బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులు గమనించాల్సింది ఇవే..
ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. అన్ని స్టేషన్‌లలోనూ అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలి. బెట్టింగ్‌లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. మీకు ఏమైనా సమచారం తెలిస్తే మా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాం.
– అంబర్ కిషోర్‌ఝూ,
సీపీ, రామగుండం


