రామగిరి(మంథని): సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గురువారం రామగిరి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాలు, స్టేషన్ పరిధిలో నేరాలకు సంబంధించి కేసుల నమోదుపై ఆరా తీశారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది డయల్ 100 కాల్స్‌కి వెంటనే స్పందించాలన్నారు. మంథని సీఐ రాజుగౌడ్, ఎస్సైలు శ్రీనివాస్, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోవాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని దీంతో భూమి స్వభావం తెలిసి, ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందో తెలుస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిర్వహించిన రైతు వారం కార్యక్రమంలో మాట్లాడారు. వరి కోతలు కోసిన తర్వాత గడ్డిని తగలబెట్టడం ద్వారా భూసారం దెబ్బతింటుందన్నారు. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు ఎరువుల గు రించి అవగాహన కల్పించారు. వ్యవసాయ అ ధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాల ని రైతులకు సూచించారు. సర్పంచ్ దేవేందర్, పూజ, ఏఓ పైడితల్లి తదితరులు పాల్గొన్నారు.
హామీలను గాలికొదిలిన కాంగ్రెస్
గోదావరిఖని(రామగుండం): ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు హామీలను నెరవేర్చకుండా, ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఎంపీలు, నాయకులు మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ పేరిట కాలం గడిపిందని, ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఒప్పందాల పేరుతో సీబీఐ విచారణ జరిపించాలని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు మురళీధర్‌రావు, మారుతి, కవితాసరోజిని, నీరటి శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను కప్పేసిన బూడిద
రామగుండం: ఈదురుగాలులతో రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని ఎన్టీపీసీ యాష్‌పాండ్ నుంచి భారీగా బూడిద లేచి రైల్వేకాలనీ, అక్బర్‌నగర్, కుందనపల్లి గ్రామాలను కప్పేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట పాటు ఈదురుగాలుల అనంతరం వర్షం పడడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బూడిద చెరువు కట్ట పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద లేవకుండా చర్యలు చేపట్టాల్సి ఉన్నా, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి సమస్యలు పునరావృతమవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.


