పెద్దపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఆస్పత్రికి కొత్తగా వచ్చిన సుమారు రూ.39 లక్షల విలువైన వైద్య పరికరాల ఏర్పాటు పూర్తయినట్లు వివరించారు. చిన్నపాటి సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత విప్ చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజూ సుమారు 1,000 మంది ఓపీ రోగులు ఆస్పత్రికి వస్తున్నందున వారికి అవసరమైన అన్ని సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మసీ విభాగాన్ని పరిశీలించి మందుల లభ్యతపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్లిట్ ల్యాంప్, 90డీ లెన్స్, సి–ఆర్మ్ మిషన్, యూరాలజీ తదితర పరికరాల వినియోగంపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు.


