కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో పేదలకు రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించే పథకాన్ని అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బల్దియా ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అమలైన రూపాయికే ఆఖరి దఫా పథకాన్ని మధ్యలోనే నిలిపివేయడతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. అలాగే ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 120 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, గతంలో ఈ పథకం కింద పనిచేసిన వారికి రూ.26 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని కమిషనర్ అరుణశ్రీకి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకుంటే కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణముదిరాజ్, జిల్లా మాజీ కార్యదర్శి జక్కుల నరహరి, కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్, ఐత పవన్, సిరిసేటి మల్లేశ్, అందె రాజ్‌కుమార్, బుంగ మహేశ్, బూడిద రమేశ్, పంగ రవి, కన్నూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు చేపట్టారు.


