ధర్మారం(ధర్మపురి)/పెద్దపల్లి: మండలంలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో సర్వేనంబర్ 679లోని సుమారు 72.03 ఎకరాల ప్రభుత్వ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది గురువారం మోకాపై వెళ్లి ప్రభుత్వ భూముల్లోని పంటలను తొలగించారు. సదరు భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో దేవి పెద్దలచ్చిగ పేరుతో సాగు అనుమతి మాత్రమే ఇచ్చామని, అధికారికంగా గుర్తించబడలేదన్నారు. ఈ భూమి ఎక్కువగా రాళ్లు, పొదలు, చిన్న గుట్టలతో ఉండడంతో సాగుకు అనుకూలంగా లేదని గత తహసీల్దార్ నివేదికల్లో పేర్కొన్నట్లు వెల్లడయిందన్నారు. తదుపరి విచారణలో సరైన పత్రాలు లేకుండానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదయినట్లు గుర్తించామని, దీంతో పై అధికారుల సూచనల మేరకు అక్రమ పట్టాలను రద్దు చేసి సదరు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శివకోటేశ్వర్, వివిధ గ్రామాల జీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.


