పెద్దపల్లి: రైతులు పండించిన ఉత్పత్తులను ఆరబోసుకునేందుకు సౌకర్యం లేదు. దీంతో రహదారులనే ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ధాన్యం, మొక్కజొన్నవంటి ఉత్పత్తులను రోడ్లపై పోసి ఎండ బెట్టుకుంటున్నారు. ఇరువైపులా కిలోమీటర్ల పొడవున ఆరబోయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వంద ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్లు కూడా ఇరుకుగా మారుతున్నాయి. ఎదురుగా వాహనం వస్తే సైడ్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వాహనాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నా రు. ఒక్కోసారి ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు. జిల్లాలో పట్టాదారుపాస్ పుస్తకం ఉన్న రైతులు 81,206 ఉన్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వ్యవసాయ జిల్లాగా పేరు ఉన్నా.. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో క్రయ, విక్రయాలతో ఖాళీ స్థలాలు కరువయ్యాయి. ఫలితంగా రైతులు తాము పండించిన ధాన్యం, మక్కలను ఆరబోసేందుకు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. యాసంగితోపాటు వానాకాలంలోనూ వారికి రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. ఒక్కోసారి వేగంగా వచ్చే వాహనాలతో ధాన్యం రోడ్డు కిందికి కొట్టుకుపోతోందని, దీన్ని ఏరుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఇలా రోడ్డుపైకి రావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తమ ఉత్పత్తులను విక్రయించాలంటే తేమశాతం అధికంగా ఉండకూడదనే నిబంధనలు ముప్పుతిప్పలు పెడుతున్నాయని అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందంటున్నారు.
జాతీయ రహదారులు మినహా..
జిల్లాలో ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర, జిల్లా తదితర రహదారులు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోనూ ఉన్నాయి. దాదాపు ఈ రోడ్లపై ప్రతీ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోస్తున్నారు. రహదారి ఆరంభం నుంచి చివరి వరకూ ధాన్యం, మక్కలు, కొన్నిచోట్ల కందులు, పెసలు లాంటి పప్పుదినుసులు ఆరబోస్తున్నారు.
కల్లాల నిర్మాణమే పరిష్కారం
నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి హామీ ద్వారా జిల్లాలో కల్లాలు నిర్మించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. నిధులూ మళ్లిపోయాయి. అప్పటినుంచి కల్లాల నిర్మాణానికి అనుమతి రావడంలేదు. రైతులు కల్లాలు నిర్మించుకోలేకపోయారు. ధాన్యం, మక్కలు, పప్పుదినుసుల లాంటి వ్యవసాయ ఉత్పత్తులు కనీస తేమశాతం వచ్చేందుకు పెద్దసంఖ్యలో కల్లాలు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వమే రైతులను పోత్సహించడం మేలంటున్నారు.
ఈఏడాది 102 ప్లాట్‌ఫారమ్స్ నిర్మాణం..
ప్రభుత్వం ఇప్పటికే ఉపాధిహామీ ద్వారా కల్లాల(డ్రై ప్లాట్‌ఫామ్స్) నిర్మాణం చేపట్టింది. ఈఏడాది 102 మంజూరు చేసింది. ఒక్కో యూనిట్‌పై రైతులకు రూ.56 వేల నుంచి రూ.85 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. వీటిని అత్యధిక సంఖ్యలో నిర్మిస్తేనే రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోడ్లపైనే ధాన్యం కుప్పలు సౌకర్యం లేక ఎండబెడుతున్న రైతులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు


