పెద్దపల్లి: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. పెద్దపల్లి బండారికుంటకు చెందిన సుధాకర్, రవీందర్, శోభన్.. సర్వే నంబర్ 556లోని 1.22 ఎకరాలను కొందరు దొంగ పట్టా చేయించుకున్నారని, దానిని రద్దు చేయాలని విన్నించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన ఎం.రాఘవరెడ్డి.. తన పోషణ బాధ్యతలు విస్మరించిన ఇద్దరు కుమారులు, కోడ లిపై చర్య తీసుకోవాలని, పెద్దపల్లికి చెందిన జి.సుమలత.. తనకు ఉపాధి కల్పించాలని, సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువుల నుంచి కొందరు నీటిని తొలగిస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మచ్చ కొమురయ్య, పెద్దపల్లి మండలం బొంపల్లిలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న క్వారీలపై చర్య తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్, సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన ఈగ మోహన్‌రెడ్డి.. తన15 గుంటల భూమి కనిపించకుండా పోయిందని, ట్యూషన్ ఫీజు పేరుతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, నాయకులు ఆజాద్, రాజ్‌కుమార్, రాకేశ్ ఆదిత్య కలెక్టర్‌కు విన్నవించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ శ్రీహర్ష.. పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.


