పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని మేన్‌రోడ్డు ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. అటు పాదచారులు, ఇటు వాహనదారులు పడుతున్న బాధలను దూరం చేసేందుకు మేన్‌రోడ్డును విస్తరించాలని మున్సిపల్ పాలకులు నిర్ణయించారు. ఇందుకోసం 66 ఫీట్ల రోడ్డు నిర్మించేలా కొలతలకు శ్రీకారం చుట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలకు మార్కింగ్ చేశారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్‌లు మేన్‌రోడ్డులోని భవనాల యజమానులతో సమావేశం నిర్వహించి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. ఇక విస్తరణ పనులు చకచకా సాగనున్నాయి.
రోడ్డు విస్తరణకు చర్యలు
జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో వ్యాపార, వాణిజ్యసంస్థలున్న ఈ మేన్‌రోడ్డును విస్తరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్ శ్రీహర్ష మేన్‌రోడ్డును 80ఫీట్ల మేర విస్తరించాలని ఆదేశించారు. అయితే కొన్ని భవనాలకు ఇబ్బంది కలుగుతుండడంతో వారి ప్రయోజనాల కోసం 66 ఫీట్ల మేర విస్తరించేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మధ్యలో 10ఫీట్ల మేర వాహనాల పార్కింగ్‌కోసం కేటాయించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వ్యాపార సంస్థలు అఽధికంగా ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు పక్కాగా కార్యాచరణ తీసుకుంటున్నారు. అయితే తమ భవనాలకు నష్టం వాటిల్లకుండా రోడ్డును విస్తరించాలంటూ పలువురు వ్యాపారులు రాజకీయ నాయకులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇటీవల చాంబర్‌ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఓ సమావేశాన్ని సైతం నిర్వహించుకున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈసారి పట్టణంలోని మేన్‌రోడ్డును విస్తరించి పాదచారులు, వాహనదారుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
ఇబ్బందులు తీరుతాయి
పెద్దపల్లి మేన్‌రోడ్డులో నడవా లన్న, వాహనం నడపాలన్న సాహసం చేయాల్సి వస్తోంది. గతంలో టౌన్‌మున్సిపాలిటీగా ఉన్న నాటి రోడ్డు ఆక్రమణ పాలు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పెరిగిన వాహనరద్దీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డును విస్తరిస్తే ఇబ్బందులు తీరుతాయి.
– ద్వారకదాస్ అట్టల్, పెద్దపల్లి
చర్యలు తీసుకుంటున్నాం
ప్రజల అవసరాలకు అనుగుణంగా మేన్‌రోడ్డు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ రోడ్డులో ఉన్న భవనాల యజ మానులతో సమావేశమై సూచనలిచ్చాం. సహకరించాలని కోరాం. మేన్‌రోడ్డు వ్యా పారస్తులు రోడ్డు విస్తరణకు ముందుకు రావాలి.
– వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి
టౌన్ మున్సిపాలిటీలో ఉన్న మాదిరిగానే..
దాదాపు ఆరుదశాబ్దాల కాలం క్రితమే టౌన్ మున్సిపాలిటీగా ఉన్న పెద్దపల్లిలో మేన్‌రోడ్డు చాలా విశాలంగా ఉండేదని ఆ కాలం నాటి పెద్దలు అంటుంటారు. కాలక్రమేణ పెద్దపల్లి మేజర్ పంచాయతీగా అవతరించడం, ఆ తర్వాత రోడ్డును మెల్లమెల్లగా ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విషయాలు వినవస్తున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం పెద్దపల్లిలో మాస్టర్‌ప్లాన్ అమలుకు కసరత్తు చేసినా రాజకీయ ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఆ ప్రక్రియ అర్ధాంతరంగానే ఆగిపోయింది.
జిల్లా కేంద్రంలో మేన్ రోడ్డు విస్తరణకు అధికారుల చర్యలు
66ఫీట్ల వరకు రహదారి నిర్మాణం


