పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మీ, మహాలక్ష్మి గ్రామదేవతలు (బొడ్రాయి) ప్రతిష్టాపనోత్సవాల్లో ఆదివారం పోచమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ ఎడెల్లి శ్రీదేవి, నాయకులు శంకరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కూటమిది కుటిల రాజకీయం
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ కూటమిది కుటిల రాజకీయమని నారీశక్తి అభినయ ఇన్‌చార్జి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ కూటమి అడ్డుకొని వీగిపోయేలా చేయడంపై మహిళలంతా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, నారీశక్తి జిల్లా ఇన్‌చార్జి వడ్డేపల్లి భారతి, నాయకులు పద్మ, నిర్మల, లత, రేణుక, మహేశ్, సోడాబాబు, సరిత, మమత పాల్గొన్నారు.
సంఘటితశక్తితోనే హక్కులు కాపాడుకోగలం
జ్యోతినగర్: సంఘటిత శక్తితోనే కార్మికుల హక్కులు కాపాడుకోగలమని ఐఎన్టీయసీ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఎన్టీపీసీ ఎన్భీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా అన్నారు. ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్‌షిప్‌లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండటంతో పాటు హక్కుల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సువర్దన్‌రావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, గోపాల్‌రావు, కొలని వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్లంపల్లి’లో అడుగంటుతున్న నీటి మట్టం
రామగుండం: గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ఆదివారం 9.25టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 895 క్యూసెక్కులు రాగా, ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోకు 331 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 81 క్యూసెక్కులు, వేడికి ఆవిరవుతున్న నీరు 194 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో మొత్తంగా 1095 క్యూసెక్కులుగా ఉంది.
సింగరేణిలో
మరో యూనియన్
గోదావరిఖని: సింగరేణిలో మరో యూనియన్ ఆవిర్భావం కోసం సన్నాహాలు చేస్తున్నారు. గతంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెంగర్ల మల్లయ్య సారథ్యంలో నూతన యూనియన్ ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం మేడారం సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా తమ సన్నిహితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్త యూనియన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్) పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.


