బొగ్గు దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి | - | Sakshi
Sakshi News home page

బొగ్గు దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

ఓసీపీ–3 సీహెచ్‌పీ నుంచి వెలువడతున్న బొగ్గు దుమ్ము

గోదావరిఖని: ఓ వైపు 45 డిగ్రీల మండుతున్న ఎండలు, మరోవైపు కాలుతున్న బొగ్గు నుంచి వెలువడుతున్న ఘాటైన పొగ, కాలిన బొగ్గు నుంచి వస్తున్న దుమ్ముతో సీహెచ్‌పీలో బొగ్గు అన్‌లోడ్‌ చేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–2 పరిధిలో ని ఓసీపీ–3 సీహెచ్‌పీ కార్మికులు వాయు కాలుష్యంతో శ్వాససంబంధిత వ్యాధుల పడుతున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

ఓసీపీ–3 సీహెచ్‌పీలో..

బొగ్గు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఓసీపీ–3 సీహెచ్‌పీలో సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 45డిగ్రీల ఎండ వేడిమికి మండుతున్న బొగ్గు నుంచి వస్తున్న విపరీతమైన పొగతో పాటు బొగ్గును అన్‌లోడ్‌ చేయడం, కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో భారీ దుమ్ము లేస్తోంది. నిత్యం వాయుకాలుష్యం మధ్య విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌పీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెగ్యులర్‌గా పనిచేస్తున్న కార్మికులు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు సమస్యను గుర్తించి దుమ్ములేని ప్రాంతంలో పనిచేయాలని సూచిస్తున్నారు. బొగ్గు రవాణా జరిగే గ్యాంట్రీ, కన్వేయర్‌ బెల్ట్‌, బొగ్గు అన్‌లోడింగ్‌ చేస్తున్న ప్రాంతాల్లో బొగ్గు దుమ్ము మరింత ఎక్కువగా ఉంటోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్ప్రింక్లర్ల ద్వారా బొగ్గును తడుపుతున్నా..

వేసవికాలం కావడంలో ఓసీపీ క్వారీ నుంచి ఫైర్‌ కోల్‌ ఎక్కువగా వస్తోంది. ఈక్రమంలో అదే బొగ్గు ను షావల్‌ద్వారా లిఫ్ట్‌ చేయించి డంపర్‌లో పోస్తున్నారు. అయితే సీహెచ్‌పీకి వచ్చే ముందు డంపర్‌లో మండుతున్న బొగ్గును చల్లార్చేందుకు ప్రత్యేక స్ప్రింక్లర్లను యాజమాన్యం ఏర్పాటు చేసింది. అ యితే మండుతున్న బొగ్గును ఆర్పడంలో ఇది ఏమాత్రం పనిచేయడం లేదంటున్నారు. సీహెచ్‌పీ ప్రాంతంలో గ్రౌండ్‌లెవల్‌ బంకర్ల వద్ద సరైన వెంటిలేషన్‌ ఉండటం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. వెంటిలేషన్‌ కెపాసిటీ పెరిగేందుకు హైకెపాసిటీ వెంటిలేషన్‌ ఫ్యాన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

శ్వాససంబంధ వ్యాధుల బారిన సీహెచ్‌పీ కార్మికులు

పట్టించుకోని సింగరేణి యాజమాన్యం

Advertisement
 
Advertisement
Advertisement