● తీవ్రమైన టైర్ల కొరత
● నిలిచిన విడిభాగాల సరఫరా
● ఓసీపీల్లో కదలని భారీయంత్రాలు
● బొగ్గు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం
ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓవర్ బర్డెన్(మట్టి) తొలగించడం, బొగ్గు రవాణా చేయడంలో డంపర్లు(భారీవాహనాలు) సింగరేణి సంస్థకు గుండెకాయలాంటివి. నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో ఓసీపీల వాటా దాదాపు 80శాతానికి పైగానే ఉంటుంది. ఇట్లాంటి ఉపరితల గనుల్లోని డంపర్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఓబీతోపాటు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టైర్లు లేక, విడిభాగాలు, పరికరాల సరఫరా నిలిచి ఈ దుస్థితి నెలకొంది.
టైర్లు పంక్చర్ కావడంతో వర్క్‌షాప్‌లో మూలనపడిన డంపర్
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో వాహనాలు, భారీ యంత్ర విడిభాగాలకు కొరత ఏర్పడింది. వీటికొరతతో బొగ్గు గనుల్లో ప్రధానంగా ఓసీపీల్లో భారీ యంత్రాలు నిలిచిపోతున్నాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పెరిగే సమయం, విద్యుత్‌కు డిమాండ్ తీవ్రంగా పెరుగుతున్న ఈ క్రమంలో యంత్రాలు, వాహనాలు నిలిచిపోవడం సంస్థకు సమస్యగా మారుతోంది. రామగుండం రీజియన్‌లోని ఓసీపీ–1, 2, 3, 5తోపాటు సింగరేణిలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది.
ఆర్థిక వనరుల కొరత..
వాస్తవానికి సింగరేణికి ఆర్థిక వనరుల కొరత ఎదురైంది. అవి అందుబాటులో లేక ఈపరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ప్రధానంగా డంపర్ టైర్ల కొరత తీవ్రంగా ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. బేస్‌వర్క్‌షాప్‌లో ప్రతీరోజు 30 శాతానికిపైగా డంపర్ టైర్లు, ఇతర విడిభాగాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. కిందిస్థాయి అధికారి నుంచి సీఎండీ వరకు ఈ సమస్య తెలిసినా.. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏమీచేయలేని దుస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది.
అందుబాటులో లేని విడిభాగాలు
డంపర్లు, డోజర్లు, షావల్స్, పొక్లెయిన్‌లు, బోజర్లు తదితర వాహనాలు, యంత్రాల విడిభాగాల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వేసవిలో అధికంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని కార్మికులను ఉరుకులు ప రుగులు పెట్టించే యాజమాన్యం.. ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారీ యంత్రాల మరమ్మతులపై ఎందుకు దృష్టి సారించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవిషయంలో సింగరేణి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
బకాయిల భారం..
ప్రభుత్వం నుంచిసుమారు రూ.45వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొత్త గనుల తవ్వకం, యంత్రాల కొనుగోలు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల కోసం ఇబ్బంది పడుతోంది. యంత్ర విడిభాగాలతోపాటు ఫైనాన్స్, పర్చేజ్ విభాగాల్లోపై దీనిప్రభావం చూపుతోంది. సివిల్ పనులు కూడా పెండింగ్ పడుతున్నాయి.
కాస్త ఆలస్యమైంది..
డంపర్లు, ఇతర యంత్రాలకు అవసరమైన వంద టై ర్లు ఇప్పటివరకు వచ్చాయని ఓ అధికారి తెలిపా రు. ఇంపోర్టెడ్ టైర్లు కావడంతో కొనుగోలు విషయంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం కాస్త ఆలస్య మైన మాట వాస్తవమే అన్నారు. రిపేర్‌లో ఉన్న డంపర్ల టైర్లను రన్నింగ్‌లోని వాటికి అమర్చి నడిపిస్తు న్నామన్నారు. దశలవారీగా అన్నింటినీ వినియోగంలోని తీసుకొస్తామని, అలాగే విడిభాగాల విషయంలోనూ కాస్త జాప్యం అవుతోందని వివరించారు.
బొగ్గు ఉత్పత్తిలో కీలకం..
బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న ఓసీపీల్లోని భారీ యంత్రాలకు టైర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రతీ ఓసీపీలోని డంపర్లలో 30 శాతం వరకు టైర్లు లేక నిలిచిపోతున్నాయని అంటున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత లేక ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని పేర్కొంటున్నారు. అంతేకాదు.. టైర్ల కొనుగోలుకు యాజమాన్యం యత్నిస్తున్నా భారీ బడ్జెట్ అవసరం కావడంతో ఏమీచేయలేని పరిస్థితిల్లో ఉందని తెలుస్తోంది.


