కోల్‌సిటీ/పెద్దపల్లిరూరల్: ఆస్తిపన్ను, నల్లాబిల్లులు ముందుగా చెల్లించేవారికోసం ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకం కింద జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల ద్వారా రూ.11.65 కోట్ల ఆదాయం సమకూరింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఆస్తిపన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు ముందుకొచ్చే వారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేసింది. ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది.
రాష్ట్రవ్యాప్తంగా 15.11శాతమే
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా రూ.1,667.75 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఎర్లీబర్డ్‌తో 4,04,981మంది రూ.252 కోట్లు(15.11శాతం) చెల్లించి ఐదుశాతం రాయితీ పొందారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీ 58.41శాతం వసూలుతో అగ్రభాగాన నిలవగా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం ద్వి తీయ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ రూ.8.61కోట్ల వసూలుతో(44.70శాతం) ఐదోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆఖరు స్థానంలో భూపాలపల్లి మున్సి పాలిటీ రూ.కోటి 2లక్షల ఆదాయాన్ని (1.05శాతం)తో నిలిచింది. కార్పొరేషన్లలో చూస్తే.. రామగుండం కార్పొరేషన్ అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.
బల్దియాలకు రూ.11.65కోట్ల ఆదాయం
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌ల నుంచి రూ.11.65కోట్ల ఆదాయం ఎర్లీబర్డ్ ద్వారా సమకూరింది. రామగుండంలో రూ.19.26 కోట్ల డిమాండ్ ఉండగా రూ.8.61కోట్ల (44.70శాతం) ఆదాయాన్ని సాధించి రాష్టంలో ఐ దోస్థానాన్ని ఆక్రమించగా, జిల్లాలో అగ్రగామిగా ఉంది. అలాగే మంథని మున్సిపాలిటీలో రూ. 2.53కోట్ల డిమాండ్ ఉండగా రూ.63 లక్షలు సాధించి రాష్ట్రంలో 23వ, జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. పెద్దపల్లిలో రూ.8.78కోట్ల డిమాండ్ ఉండగా రూ.1.86కోట్లు సాధించి(21.18శాతం)తో రాష్ట్రంలో 38వ స్థానం, జిల్లాలో మూడోస్థానంలో ఉంది. సుల్తానాబాద్‌లో రూ.2.99కోట్ల డిమాండ్ ఉండగా రూ.55లక్షలు(18.39శాతం) మాత్రమే ఆదాయా న్ని సమకూర్చుకుని రాష్ట్రంలో 51వ స్థానం, జిల్లాలో ఆఖరు స్థానంలో ఉంది.
పరిశ్రమల నుంచి అనూహ్య స్పందన
రామగుండంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి 62 వేల వరకు అస్సెస్‌మెంట్లు ఉండగా, మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.23 కోట్ల వరకు ఉంది. ఎర్లీబర్డ్ ఆఫర్‌కు ఆయ పరిశ్రమల నుంచి స్పందన లభించింది. ఎన్టీపీసీ రూ.3.88 కోట్లు, సింగరేణి రూ.కోటి 17లక్షలు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రూ.కోటి 8లక్షలు, జెన్‌కో రూ.5లక్షల 99వేలు ఎర్లీబర్డ్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించాయి.
అభినందించిన మేయర్, కమిషనర్
ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి, వసూలు చేసిన రెవెన్యూ సిబ్బందిని రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఐదుశాతం రాయితీతో ఆస్తిపన్ను వసూలు చేయడంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లలో రామగుండం అగ్రస్థానంలో నిలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లిస్తూ నగరాభివృద్ధికి సహకరించాలని మేయర్, కమిషనర్ కోరారు.
జిల్లాలో రామగుండం కార్పొరేషన్ అగ్రస్థానం
డిమాండ్ రూ.19.26 కోట్లు ఉంటే వసూలు చేసింది రూ.8.72కోట్లు
చివరిస్థానంలో సుల్తానాబాద్ బల్దియా
ముందస్తు ఆస్తిపన్ను చెల్లించిన పరిశ్రమలు


