పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఐటీఐ ప్రహరీని ఆనుకుని టేలాలు వేసుకుని కొందరు చిరువ్యాపారులు జీవనం సాగించారు. సదరు చిరువ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులు కేటాయిస్తామని 1996లో అప్పటి అధికారులు, పాలకులు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కానీ, మూడు దశాబ్దాలు గడచినా ఆ హామీ నెరవేరలేదని అప్పటి తహసీల్దార్‌కు డీడీలు చెల్లించిన పలువురు టేలా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీబస్టాండ్ సమీపంలో ప్ర భుత్వ ఐటీఐ రాజీవ్ రహదారి, రైల్వేస్టేషన్ రోడ్డును ఆనుకుని ఉంది. ఐటీఐ ప్రహరీని కూల్చి రాజీవ్ రహదారి వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలోనే అధికారులు ఈ ప్రక్రియకు పూనుకున్నా రు. ఆ రోడ్డు విస్తరణ సమయంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంట చిరువ్యాపారాలు చేసుకునే వారి టేలాలు తొలగించడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోదని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సుల్తానాబాద్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కానీ, పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ అధికారులు కాంపెక్స్ నిర్మాణానికి అంగీకరించలేదు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొ దలు కాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న గీట్ల ము కుందరెడ్డి దృష్టికి ఈ షాపింగ్ వ్యవహారం రాగా.. అప్పటి కేంద్రమంత్రి జి.వెంకటస్వామితో చర్చించి సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో కేంద్రమంత్రి వెంకటస్వామి సతీమణి మరణించడంతో కార్యక్రమం వాయిదా పడింది. అప్పటినుంచి షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం ఎటూతేలడంలేదు.
డీడీల సొమ్ము ఏమైనట్టు?
పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. నిర్వాసిత టేలా వ్యాపారుల నుంచి కంట్రిబ్యూషన్‌గా ఒక్కొక్కరి నుంచి రూ.5వేల నుంచి రూ.20వేల వరకు సేకరించారు. ఆ సమయంలో తహసీల్దార్ పేరిట చెల్లించిన డీడీల సొమ్ము ఏమైందో తెలియదు గానీ.. ఇప్పటివరకు షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరగక.. చెల్లించిన చిరువ్యాపారుల కు తిరిగి ఇవ్వక ఆ సొమ్ము ఏమైందో తెలియని స్థితి ఉంది. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై దృష్టి సారించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై సందిగ్ధం
కంట్రిబ్యూషన్ డీడీలు చెల్లించి మూడు దశాబ్దాలు
ఇంకా ప్రారంభించని పనులు
టేలా నిర్వాసితుల్లో ఆందోళన


