పెద్దపల్లిరూరల్: ఊళ్లో రెండు వాటర్ ట్యాంకులు ఉండి.. ఇంటింటికీ మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నా ఎస్సీ కాలనీవాసులకు దాదాపు మూడేళ్లుగా తాగునీటి సరఫరా సాగడంలేదు. ఈసారి ఎండలు మండిపోతుండడంతో నీటిసమస్య తీవ్రరూపం దాల్చింది. కాలనీవాసులు అందరూ పంచాయతీ పాలకమండలి దృష్టికి తీసుకెళ్లారు. అదే చీకురాయి గ్రామంలోని కాలనీ. సర్పంచ్ ఓదెల శ్రీనివాస్, కార్యదర్శి శంకరయ్యతోపాటు పాలకమండలి సభ్యులు తమ సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. స్పందించిన పాలక మండలి సభ్యులు.. డైరెక్ట్ పంపింగ్ ద్వారా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. దీంతో కాలనీవాసుల్లో సంతోషం వ్యక్తమైంది.
ఇంటింటికీ నల్లా కనెక్షన్..
పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉంది. కానీ మూడేళ్లుగా ఎస్సీకాలనీవాసులకు తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మండుటెండలకు సమస్య మరింత జటిలమైంది. దీంతో పరిష్కారం ఎలా చూపాలా? అని పంచాయతీ పాలకులు, కార్యదర్శి ఆలోచించారు. వాటర్ ట్యాంకుకు సరఫరా అవుతున్న ప్రధాన పైపులైన్ నుంచి నేరుగా కాలనీవాసులకు నీటిని అందించేలా వాల్వ్ ఏర్పాటు చేశారు. వాల్వ్ ఆన్ చేయగానే నల్లాల ద్వారా ఇళ్లకు తాగునీరు చేరడంతో కాలనీవాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సమస్యకు పరిష్కారం చూపిన పంచాయతీ పాలకమండలి, కార్యదర్శికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
చీకురాయి ప్రొఫైల్
జనాభా 1,580
నివాసాలు 473
వాటర్ ట్యాంకులు 02
(60వేలు, 40వేల లీటర్ల నీటి సామర్థ్యం)
కుళాయి కనెక్షన్లు 473
చీకురాయి ఎస్సీకాలనీకి నీటిసరఫరా
మరమ్మతు పనులు చేయించిన పంచాయతీ పాలకులు


