● ముందుగా ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జూలపల్లి: మాజీసీఎం కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రం, నందిమేడారం, చామన్‌పల్లిలో ధాన్యం కొనుగోళ్లను మంత్రి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగిపోవాలని, బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని హరీశ్‌రావుతోపాటు కొత్తగా పార్టీలో చేరిన జీవన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబం తొలుత ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నారు. కేసీఆర్ కూతురు కవితకు కొత్తగా పార్టీ పెట్టేం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకు క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు నిర్ణయించి చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. చామనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇరిగేషన్‌శాఖ ద్వారా స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.


