పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల టీ హబ్ వ్యాధి నిర్ధారణ టెస్టుల్లో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌కు అవార్డు అందించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రోజూ 1,500 నుంచి 2 వేల వరకు శాంపిళ్లు సేకరిస్తున్న సిబ్బంది.. 4 గంటల్లోనే ఫలితాలు అందిస్తున్నారు. పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి వారు కూడా టీ హబ్ సేవ లు వినియోగించుకుంటున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం(టీ–హబ్)లో 53 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారు. బయోకెమిస్ట్రీ, పాథలాజికల్, మైక్రోబయాలజీ, థైరాయిడ్ వంటిసేవలు తక్కువ సమయంలోనే అందిస్తున్నారు.
అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం
అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మిషనరీలను ప్రభుత్వం టీ–హబ్ కోసం కొనుగోలు చేసింది. ఫుల్ ఆటోమెటిక్ సిస్టంతో ఏర్పాటు చేసిన బయోకెమిస్ట్రీ అనలైజర్ మిషన్‌తో ప్రతీగంటకు 1,800 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. రూ.80 లక్షల విలువైన ఈ యంత్రం ద్వారా అనేక రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సెల్ కౌంటర్ మిషన్‌కు ప్రతీ గంటకు 1,500 టెస్టులు చేసే పామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు థైరాయిడ్ టెస్టుకు రెండు రోజుల సమయం పట్టేది. టీ–హబ్ మిషన్‌తో అదేరోజు ఫలితంగా అందించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంది. వీటితోపాటు యూరిన్ ఆనలైజర్ మిషన్, ఇమ్యునో కెమిస్ట్రీ అనలైజర్, ఎలీసారీడర్, 2 డీ ఎకో మిషన్, ఈసీజీ మిషన్లు సమకూర్చారు.
24 కేంద్రాలు, 3 రూట్లు..
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాధి నిర్ధారణ కేంద్రం పరిధిలో 24 సెంటర్లు, 3 రూట్లు, 3 వాహనాలతో శాంపిళ్లు సేకరిస్తున్నారు. జిల్లాలోని 18 ప్రాథమిక, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల్లోని పేషెంట్ల వ్యాధులను బట్టి షాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు శాంపిల్స్‌ను టీ–హబ్‌లో అందించాల్సి ఉంటుంది. షాంపిల్స్‌ను బార్‌కోడ్స్ సాయంతో స్కాన్ చేసి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఆ వెంటనే పే షెంట్ మొబైల్ నంబరు లేదా మెయిల్‌కు రిపోర్టు సమాచారం అందిస్తున్నారు. మాన్యువల్ పద్ధతిన కూడా నివేదికలు పొందే అవకాశం ఉంది.
నెల పరీక్షలు
జనవరి 32,072
ఫిబ్రవరి 42,125
మార్చి 44,057
ఏప్రిల్(ఇప్పటివరకు) 35,319
మొత్తం 1,53,573
టీ హబ్‌లో చేసిన వివిధ పరీక్షలు
వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో జిల్లా ఆస్పత్రి అగ్రస్థానం
రాష్ట్రంలోనే ప్రత్యేకత సాధించినట్లు గుర్తింపు


