● కలెక్టర్ కోయ శ్రీహర్ష
ముత్తారం: స్థానిక తహసీల్దార్ భవనం జూన్ 2న ప్రారంభించే అవకాశం ఉందని, ఇందుకోసం అన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగవంతం చేయాలని పీఆర్ ఏఈ జగదీశ్, కాంట్రక్టర్‌ను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ రోజున భవనం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేసవిలో పూర్తిచేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి ఉన్నారు.
నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ చైర్మన్ల భర్తీ
పెద్దపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేస్తామని మంత్రివర్గం ప్రకటించడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికార పా ర్టీ నాయకులు ఎవరికి వారే నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా 13 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. సొసైటీల్లో 46,531 మంది ఓటర్లు ఉండగా పురుషులు 36,673 మంది, మహిళలు 9,858 మంది ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన దగ్గరనుంచి ఉమ్మడి జిల్లాలో కేడీసీసీ మాత్రమే కొనసాగుతోంది. డీసీఎంఎస్‌లు, కేడీసీసీలు కొత్తవి ఏర్పాటు చేస్తారా? లేక పాత వాటినే కొనసాగిస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
20న హైదరాబాద్‌కు పాదయాత్ర
పెద్దపల్లి: విద్యార్థుల పెండింగ్ స్కాలరషిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈనెల 28న హైదరాబాద్‌లోని సీఎం ఇంటి వరకు పాదయాత్ర చేపడతామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ తెలిపారు. ‘చలో సీఎం ఇంటికి’ పాదయాత్ర పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫీజు లు చెల్లిస్తేనే హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆయన అన్నారు.
యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఎలిగేడు: రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమని రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్‌రావు, కిరణ్ పెల్లి అన్నారు. ధూళికట్ట రైతువేదికలో శుక్రవారం సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన క ల్పించారు. నత్రజని, భాస్వరం, ఫొటాష్ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్, ప్రజలకు పంచాయతీరాజ్ ప్రాముఖ్యత గురించి వివరించారు. సర్పంచ్ కొమురయ్య, ఏవో ఉమాపతి, ఏఈవో శరణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,888
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,888 ధర పలికిందని మార్కెట్‌కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్ట ధర రూ.6,414గా, సగటు ధర రూ.6,818గా ఉందని పేర్కొన్నారు.


