ఆర్టీసీ కార్మికుల మౌనప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల మౌనప్రదర్శన

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

గోదావరిఖనిటౌన్‌: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు శుక్రవారం నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ కోలా శంకర్‌గౌడ్‌ ఆత్మాహుతికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వంగర శ్రీనివాస్‌, కార్మికులు పాల్గొన్నారు.

డ్రైవర్‌ మృతికి సంతాపం..

మంథని డిపో ఎదుట ధర్నా

మంథని: నర్సంపేట బస్సు డిపో డ్రైవర్‌ శంకర్‌ మృతికి సంతాప సూచకంగా మంథని డిపో ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు. డిమాండ్లను పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలు వద్దని జేఏసీ చైర్మన్‌ కేకే రెడ్డి, వైస్‌ చైర్మన్లు ఐలయ్య, ఖాదర్‌ కోరారు. డ్రైవర్‌ మృతికి కార్మికులు సంతాపం తెలిపారు. ఎస్‌ఐ రమేశ్‌ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రైవేటు బస్సులను నడిపించారు. మంథని బస్సు డిపో వెల్పేర్‌ కమిటీ సభ్యులు, డ్రైవర్‌ సతీశ్‌, కండక్టర్‌ సుమలత తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గందం రమేశ్‌, ఖుతుబుద్దీన్‌,జనార్దన్‌, పోచం, ఇంతియాజ్‌ బేగం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల భారీబందోబస్తు

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూహ్య ఘటనలు జరిగితే ఇబ్బందులు తలెత్తకుండా 108 అంబులెన్సును సైతం అందుబాటులో ఉంచారు. పెద్దపల్లితోపాటు సుల్తానాబాద్‌ బస్టాండ్‌లోనూ ఎస్సైలు భద్రతా చర్యలు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement