ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి
పెద్దపల్లి: ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉండాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో సింగరేణితో పాటు ఓపెన్‌కాస్ట్‌లు అధికంగా ఉన్నా యి గోదావరి, మానేరు వాగుల పరిసరాల్లో సైతం ఎండ తీవ్రత కారణంగా వేడి అధికంగానే ఉంటోంది. దీంతో ఫ్యాన్లు, కూలర్లతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతు
ఎండ తీవ్రతకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో మధ్యాహ్నం, రాత్రివేళలో కూలర్లతోపాటు ఫ్యాన్‌లతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతారు. ఈనేపథ్యంలో వాటిని మరమ్మతు చేసే పనిలో ఉన్నారు. కాగా, మధ్యతరగతి చెందిన పలువురు ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏసీలు ఉన్నవారు రిపేర్ చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు.
ప్రజాబాట పేరుతో..
విద్యుత్ ప్రజాబాట పేరుతో సంబంధిత అధికారులు కాలనీలు, గ్రామాలను సందర్శించి లూజు లైన్లు, తదితర మరమ్మతు పనులు చేస్తున్నారు. ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్స్, నూతన స్తంభాలు, వైర్లను బిగించారు. ప్రజలకు విద్యుత్ అసౌకర్యం కలగకుండా వేసవికి ముందే జిల్లావ్యాప్తంగా పలు మరమ్మతులు చేపట్టారు. విద్యుత్ బాటతో ఇబ్బందులు కలగవని భావిస్తున్నారు.
పెరిగిన ఎండ
రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి 26,27,28వ తేదీల్లో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత అధికంగా ఉండి రోడ్డుపైకి జనం రావడం లేదు. కాగా, రాత్రి వేళలో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో పాటు వేకువజామున చలి సైతం ఇబ్బందిపెడుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తుంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మార్చిలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
పెద్దపల్లి 35– 37
సుల్తానాబాద్ 35– 36
మంథని 36– 38
గోదావరిఖని 37 39
కాల్వశ్రీరాంపూర్ 35– 36
ధర్మారం 34– 36
జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు, వ్యవసాయదారులు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి అయితేనే ఎండకు వెళ్లాలి. తలకు టవల్ కట్టుకోవడంతోపాటు ముక్కు, చెవులకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
– ప్రమోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బేజారు
ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతు
పెరిగిన ఏసీ వినియోగదారులు


