గతేడాది 121.. ఈసారి 141..
మంథనిరూరల్: వివిధ కారణాలతో బడి మానేసిన బడీడు పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించి విద్యలో భాగస్వామ్యం చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని బడీడు పిల్లల వివరాల సేకరణకు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31వరకు జిల్లా వ్యాప్తంగా సీఆర్పీలు బడీడు పిల్లల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో 545 పాఠశాలలు ఉండగా 48 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి ఆయా క్లస్టర్‌లో విధులు నిర్వహించే సీఆర్పీలకు సర్వే బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 141మంది బడిబయట పిల్లలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ఇలా..
జిల్లా వ్యాప్తంగా గతేడాది నిర్వహించిన సర్వేలో 121 మంది బడిబయటి పిల్లలను గుర్తించగా తాజాగా చేపట్టిన సర్వే ద్వారా 141మంది పిల్లలను గుర్తించారు. వీరిలోబడి మానేసిన 6 నుంచి 14 ఏళ్ల లోపువారు 101 మంది, 14 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 40 మందిని గుర్తించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
తేలిన బడి బయట పిల్లల లెక్క
ఫీజులు ప్రభుత్వమే భరిస్తుంది
గ్రామీణ ప్రాంతాల్లో బడిమానేసిన 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుంది. పదో తరగతి, ఆపై చదవి మానేసిన వారికి మళ్లీ ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదువు కోసం ఫీజులు ప్రభుత్వమే చెల్లించి పరీక్షలు రాయిస్తుంది. బడి బయట పిల్లలను గుర్తించే సర్వే ప్రక్రియ పూర్తి కాగా గుర్తించిన విద్యార్ధులను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నం.
– పీఎం షేక్,
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్


