డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు అడ్డుకట్ట
గోదావరిఖని(రామగుండం): డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలను అరికట్టవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. అరైవ్.. అలైవ్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక సింగరేణి వీటీసీలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత అని, అయితే శాశ్వత మార్పు రావాలంటే ప్రతీ వాహనదారు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. అల్కాహాల్ తాగి వాహనం నడపడం చిన్న తప్పు కాదని, అది తమ కుటుంబానికే కాక ఇతర కుటుంబాలకు కూడా అపార నష్టం కలిగించవచ్చన్నారు. సమాజ అవగాహనతో అందరూ కలిసి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలన్నారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, రోడ్ సేఫ్టీ పెద్దపల్లి జోన్ ఇన్‌చార్జ్ సీఐ రమేశ్‌బాబు, ఎస్సైలు మనోహర్, హరీశ్‌శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా


