పనులు నాణ్యతతో పూర్తి చేయండి
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో అభివృద్ధి పనులను పూర్తి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా, స్థానిక లక్ష్మీనగర్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను శనివారం మేయర్ పరిశీలించారు. రద్దీ దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన మార్చిలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పని పూర్తయ్యే వరకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పలువురు కార్పొరేటర్లు, నగర పాలక ఈఈ పీవీ రామన్, ఏఈ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదాల నియంత్రణకు అరైవ్.. అలైవ్
పెద్దపల్లిరూరల్: సమాజంలోని ప్రతీ పౌరుడు రోడ్డు భద్రత నియమావళిపై కనీస అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. అరైవ్.. అలైవ్ ఫేజ్–2లో భాగంగా శనివారం పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అవగాహన కల్పించారు. రోడ్లపై వాహనాలను నడిపే సమయంలో కనీస జాగ్రత్తలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యం చేరుతారన్నారు. మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావొద్దన్నారు. సీఐ ప్రవీణ్‌కుమార్, సుల్తానా బాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై లక్ష్మణ్‌రావు, నరే శ్, ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయడ ఉన్నారు.
ఊబకాయం నియంత్రణపై సదస్సు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)లో శనివారం ‘క్రాకింగ్ ది కోడ్ ఆఫ్ ఒబేసిటీ: ఫ్రమ్ మాలిక్యూల్స్ టు మెడిసిన్’ అనే అంశంపై నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి (సీపీడీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊబకాయం కారణాలు, నివారణ చర్యలు, ఆధునిక చికిత్స విధానాలపై విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ జైదీప్‌నేత మాట్లాడుతూ, అధునాతన బేరియాట్రిక్ శస్త్రచికిత్స ప ద్ధతులు, వాటి ద్వారా లభిస్తున్న ఫలితాలను వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన కార్యక్రమాన్ని డాక్టర్ ప్రదీప్‌చంద్ర సమన్వయం చేశారు. వివిధ రాష్ట్రాల వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ల కు నిర్వహించిన పరిశోధన పోస్టర్ పోటీ ఆకట్టుకోగా, విజేతలకు బహుమతులు అందంచారు.
‘ఉపాధ్యాయుల హక్కులపై గొడ్డలిపెట్టు’
రామగుండం/ఎలిగేడు: తెలంగాణ విద్యా విధానంలో భాగంగా ఉపాధ్యాయుల జీతభత్యాలపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ చేసిన సిఫార్సులు ఉపాధ్యాయుల హక్కులపై గొడ్డలిపెట్టు అని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందల లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణ విద్యా విధానంలో రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం నిధులు కేటాయింపు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను స్వాగతిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థపై విద్యావంతులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకొని తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పనులు నాణ్యతతో పూర్తి చేయండి


