రిజర్వేషన్లు ఖరారు
బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ సీట్లు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జిల్లాలోని మున్సిపాల్టీలకు చేరిన ఉత్తర్వులు జిల్లాలో 124డివిజన్లు/ వార్డుల్లో బీసీలకు 36, ఎస్సీలకు 21 సీట్లు మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయింపు ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి
సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నగరపాలక, పురపాలక సంస్థల వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ వివరాలను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు.
రిజర్వేషన్ ప్రక్రియ ఇలా..
పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యలో మార్పులు లేకపోవడంతో గతఎన్నికల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లను రిజర్వు చేశారు. అయితే శివారు గ్రామాల విలీనంతో రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. దీంతో అక్కడకూడా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లకు రిజర్వేషన్ ప్రక్రియ ఉండగా, బీసీ సీట్లను మాత్రం బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేటాయింపులు చేపట్టనున్నారు.
జిల్లాలో మొత్తం వార్డులు 124
రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, పెద్దపల్లిలో 36, మంథనిలో 13, సుల్తానాబాద్‌లో 15 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో కలిపి 124/డివిజన్లు/వార్డులు ఉండగా, బీసీలకు 36 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. 17 సీట్లను మహిళలకు కేటాయించింది. అలాగే ఎస్సీలకు 21 సీట్లు కేటాయించగా, 10 సీట్లు మహిళలకు కేటాయించారు. జనరల్ కింద 63 సీట్లు ఉండగా, 34 సీట్లను మహిళలకు కేటాయించారు.
వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపుపై అధికారులు కరసత్తు చేస్తున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయిస్తున్నారు. కలెక్టర్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో మహిళల సీట్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు జాబితా
నగరంలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను బల్దియా శుక్రవారం ప్రచురించింది. కార్యక్రమంలో బల్దియా కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, టీపీబీవోలు హిమజ, సింధూజ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


