సమన్వయం కుదిరేనా?
అధిష్టానం వద్దకు చేరిన ‘కమలం’ పంచాయితీ బీజేపీ జిల్లా అధ్యక్షుడితో కలిసి పనిచేయలేమని వినతి ఫిర్యాదుదారుల్లో జిల్లా కమిటీ నాయకులు
పెద్దపల్లిరూరల్: బీజేపీ గ్రూపు రాజకీయాలు పార్టీ రాష్ట్ర కార్యాలయ తలుపులు తట్టాయి. ఇప్పటి వరకు రోజుకో మలుపు తిరుగుతూ వచ్చిన కమలనాథుల కలహాలు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వరకూ వెళ్లాయి. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని జిల్లా కమిటీలోని ప్రముఖులతోపాటు సీనియర్లు కూడా రాష్ట్ర నాయకత్వంతోపాటు కేంద్రమంత్రికి శుక్రవారం విన్నవించేదాకా వెళ్లాయి. రాష్ట్ర నాయకత్వం జిల్లాలో గ్రూపులను సమన్వయం చేస్తుందా? లేక కేంద్రమంత్రి బండి సంజయ్ అండదండలు ఉన్న కర్రె సంజీవరెడ్డిపై చర్యలు తీసుకునేదాక వెళ్లుందా? అనే చర్చ సాగుతోంది.
ఒక్కటైన గుజ్జుల, దుగ్యాల వర్గీయులు..
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ నేత దుగ్యాల ప్రదీప్‌కుమార్ మధ్య విభేధాలు ఉన్నా ప్రస్తుతం ఇరువర్గాలు ఒక్కటయ్యాయి. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి జిల్లా అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభారీలకు ఖర్చుల కోసం విడుదల చేసిన సొమ్మును సైతం జిల్లా అధ్యక్షుడే వాడుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలకు సత్కారాలను తమ సొంతఖర్చుతో చేస్తే జిల్లా అధ్యక్షుడు వ్యాపారులనుంచి వసూలు చేసుకున్నారని రాంచందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కమిటీలో పదవులకు సైతం తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పదాధికారులు, పార్టీ బాధ్యులను దూషిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపుకు పనిచేయాల్సిందిపోయి.. తన సొంతగ్రామమైన ఓదెల మండలం కొలనూర్‌లో మాజీ ఎంపీటీసీ సర్పంచ్‌గా పోటీచేస్తే ఆయనపై రెబల్‌ను నిలిపి ఓడించారని వివరించినట్లు సమాచారం. ఒంటెత్తు పొకడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్న, పార్టీ అధ్యక్షుడు వ్యవహరించే తీరు సరిగ్గా లేకనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ విషయాలన్ని జిల్లా ఇన్‌చార్జి నాగపురి రాజమౌళికి కూడా విన్నవించినట్టు జిల్లా ప్రధాన కార్యదర్శులు కడారి అశోక్‌రావు, పల్లె సదానందం తెలిపారు.
‘బండి’ మద్దతుతో నిలుస్తాడా?
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అనుచరుడు కర్రె సంజీవరెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో జిల్లా అధ్యక్ష పదవి దక్కినట్లు ప్రచారంలో ఉంది. ప్రస్తుత పరిస్థితులు తారుమారు కావడంతో వైరి వర్గీయులు దుగ్యాల, గుజ్జుల అనుచరులు ఒక్కటిగా వెళ్లి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో సంజీవరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేక బండి సంజయ్ సహకారంతో గట్టెక్కుతాడా? అనే చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ తనసొంత జిల్లా కరీంనగర్‌కు పార్టీ అధ్యక్షుడిని నియమించుకోలేదు కానీ.. పక్కన ఉన్న పెద్దపల్లి జిల్లాపై ఇంతప్రేమ ఎందుకని పలువురు నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీకి పోటీపడాలనే ఆలోచన ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు వ్యతిరేకంగా పావులు కదిపి సంజీవరెడ్డిని కాపాడతారో? లేదో? వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నేత అశోక్‌రావు, బీజేపీ నేతకు వివరిస్తున్న నాయకులు
సమన్వయం కుదిరేనా?


