రాజన్నపై వివక్షేలా?
ఆలయ పనుల జాప్యంపై భక్తుల ఆవేదన పనుల పురోగతిపై నేతల పర్యవేక్షణ పెరగాలని డిమాండ్ మేడారం తరహాలో పనులపై సమీక్ష లేదని భక్తుల నిర్వేదం 20 నుంచి వేగం పెంచుతామంటున్న ఆర్ అండ్ బీ అధికారులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల్లో ఎడతెగని జాప్యం భక్తులకు వేధిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయమైన రాజన్న కోవెలలో జరుగుతున్న పలు అభివద్ధి పనుల మీద అనుకున్నంత మేర పర్యవేక్షణ, సమీక్ష జరగడం లేదన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతేడాది ద్వితీయార్థంలో మొదలైన అభివద్ధి పనులు మేడారం జాతర వరకు పూర్తవుతాయి అని తొలుత అనుకున్నా.. బాహుబలి యంత్రం మొరాయించడంతో అది కాస్త శివరాత్రి వరకు అని అంచనా వేస్తున్నారు. పనులు ప్రారంభించిన సమయంలో వేగంగానే పూర్తి చేద్దామని ఆర్ అండ్ బీ అధికారులు ప్రణాళికలు రచంచించినప్పటికీ.. ప్లానింగ్‌లో లోపాల కారణంగా ఈ పనులు రోజురోజుకు జాప్యమవుతున్నాయి. ప్రస్తుతం పండగల కారణంగా కూలీలు ఊళ్లకు వెళ్లారని, వచ్చే 20వ తేదీ నుంచి పనులు మునపటి కంటే వేగం పుంజుకుంటాయని ఆర్ అండ్ బీ అధికారులు ధీమాగా ఉన్నా.. భక్తులు మాత్రం మందకొడి పనులపై ఉసూరుమంటున్నారు.
మేడారం తరహాలో పర్యవేక్షణ ఏది?
దేశంలో జరిగే అతిపెద్ద జాతరలో మేడారం కూడా ఒకటి. ఇందుకోసం దేవాదాయ మంత్రి సురేఖ, స్థానిక మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పనులను పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల కోసారి జరిగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం కంటే ప్రాచీనమైన ఆలయంగా పేరొందిన రాజన్న గుడిలో మాత్రం జరుగుతున్న అభివద్ధి పనులను వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ (వీటీడీఏ), స్థానిక ఎమ్మెల్యే మాత్రమే పర్యవేక్షణ జరుపుతున్నారు. కొన్ని నెలలుగా రాజన్న దర్శనాలు, కోడెమొక్కులు అన్నీ భీమన్న గుడిలోనే జరుగుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన ఈ ఆలయ అభివద్ధికి వీటీడీఏ వైస్ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉంటారు. కానీ, ప్రస్తుతం జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్ లేరు. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిపాలన బాధ్యతలతోపాటు ఆమెకు స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అదనపు భారంగా మారాయి. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, ఆపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో వైటీడీఏ వైస్ చైర్మన్‌గా ఆమెకు గుడి పనుల మీద సమీక్ష జరిపే సమయం చిక్కడం లేదన్నది భక్తుల ఆవేదన. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు శ్రీధర్‌భాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు ఉన్నప్పటికీ.. వేములవాడ పనుల పురోగతిపై నిరంతరం సమీక్షంచకపోవడం రాజన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కోసారి జరిగే మేడారం జాతరపై ప్రభుత్వం శ్రద్ధ చూపించిన విధంగానే నిత్యపూజలందుకునే రాజన్న ఆలయంపైనా చూపించాలని కోరుతున్నారు.
ఎక్కడిక్కడ చూసినా శకలాలు..
అభివద్ధి పేరిట ఆలయ ప్రాంగణంలో కూల్చివేసిన శకలాలు, అస్తవ్యస్త పనులు చూసి ప్రతి భక్తుడి మ నసు కలచివేస్తోందని స్థానికులు వాపోతున్నా రు. ‘దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ను అనాధలా చూస్తున్నారా?’ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివద్ధిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి,ఆలయ అభివద్ధి పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని పనుల్లో నాణ్యత, పారదర్శకతను నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు.
20 నుంచి ఊపందుకోనున్న పనులు
రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో ప్రస్తుతం మహామంటప నిర్మాణం, తూర్పు రాజగోపురం పనులు నడుస్తున్నాయి. ఉడెన్ ఫిల్లింగ్ అనే కొత్త టెక్నాలజీతో పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నారు. సంక్రాంత్రి పండుగ సందర్భంగా ఈనెల 19వ తేదీ వరకు కార్మికులు ఇంటికి వెళ్లడంతో పనులకు బ్రేక్ పడింది. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి శాసీ్త్రయ పద్ధతిలో పనులు కొనసాగిస్తున్నారు. విస్తరణ పనులు చేపట్టే ఆలయ ఆవరణలోకి కనీసం చెప్పులు కూడా వేసుకుని వెళ్లనీయడం లేదు. ఈనెల 20 నుంచి పనులు మరింత స్పీడ్‌గా కొనసాగుతాయని ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య తెలిపారు.


