జాతరకు ముందస్తు చర్యలేవి..?
సుల్తానాబాద్‌రూరల్: మినీ మేడారంగా ప్రసిద్ధి గాంచిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న శ్రీరంగానాయకస్వామి ఆలయం సమీపంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర అత్యంత వైభోవంగా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మేడారం కోయ పూజారులు వచ్చి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమీపిస్తున్నా ముందస్తు చర్యలేమి ఎండోమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టకోవడంతో.. జాతరలో తిప్పలు తప్పేట్లు లేవని భక్తులు వాపోతున్నారు.
ఇబ్బందులు తప్పేనా?
రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర 2026 జనవరి చివరి వారంలో జరగనుంది. భక్తులు బస చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ధ్వంసమైన రోడ్డును మరమ్మతు చేసి భక్తులు బస చేసేందుకు, వంటలు చేసుకునేందుకు వీలుగా జాతర సమీపంలోని పంట పొలాల్లో పంటలు సాగు చేయకుండా ఆయా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మానేరు వాగులో భక్తులు బస చేసేవారు. చెక్ డ్యాం నిర్మాణంతో నీటితో నిండి ఉండడంతో జాతర సమీపంలో ఉన్న పంట పొలాలే దిక్కయ్యే పరిస్థితి ఉంది. రంగనాయకస్వామి దేవాలయం ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి జాతర నిర్వహిస్తారు.
రోడ్లు ఇలా.. వెళ్లేదెలా..
నీరుకుల్ల నుంచి జాతర ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో ప్రయాణం నరకంగా ఉంది. గద్దెల వద్దకు వెళ్లే రోడ్డు మానేరు వాగు నీటి ఉధృతికి కొట్టుకుపోగా.. తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఈ రోడ్లతో వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గనుంది.
కమిటీ జాడ ఎక్కడ?
శ్రీరంగనాయకస్వామి ఆలయం ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఎన్నుకొని జాతర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. జాతర జరిగేందుకు నెల రోజులే ఉన్నా.. కమిటీ ఎన్నిక జరగలేదు.
జనవరిలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర
నీరుకుల్లకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తుల రాక
ప్రతిసారీ ట్రాఫిక్‌తో తిప్పలు
సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న భక్తులు
జాతరకు ముందస్తు చర్యలేవి..?


