మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ మేడ్చల్
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులుగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకోగా.. రన్నరప్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు గెలుచుకుంది. సాయంత్రం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్‌గౌడ్ ట్రోఫీలను ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పోటీల్లో రాణించిన అథ్లెట్లను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వివేకానంద విద్యాసంస్థల అధినేత సౌగాని కొంరయ్య, కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్‌రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జోరు..
రన్నింగ్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252 పాయింట్లతో ద్వితీయ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మేడ్చల్ పురుషుల విభాగంలో 250, మహిళల విభాగంలో 331 పాయింట్లు సాధించింది.
పతకాలు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గంగుల
ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. పలువురు విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వయస్సు తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
మాస్టర్ల స్టెప్పులు..
పోటీలు ముగియడంతో.. వివిధ జిల్లాలకు చెందిన అథ్లెట్లు ఆడుతూ పాడుతూ అదిరేటి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. గెలిచిన, ఓడినవారు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి వ్యాయామం అవసరమన్న సంకేతంతో జానపద పాటలపై నృత్యాలు చేసిన తీరు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
ద్వితీయ స్థానంలో రంగారెడ్డి
ముగిసిన 12వ రాష్ట్రస్థాయి పోటీలు
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ మేడ్చల్


