గోదావరిఖని: తన నియోజకవర్గాన్ని టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గం పరిశ్రమలకు, ఆధ్యాత్మికతకు నిలయమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిరంతరం 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని తెలిపారు. ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రామునిగుండాల గుట్ట, శ్రీత్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయం, గోదావరి నదీపరీవాహక ప్రాంతం ఆధ్యాత్మికతకు సూచికగా ఉన్నాయని అన్నారు. సింగరేణిలోని 7ఎల్‌ఈపీ బొగ్గు గనిని మైనింగ్ టూరిజంగా గతంలో ప్రకటించినా.. ప్రస్తుతం మూసివేశారని తెలిపారు. దానిని యథావిధిగా కొనసాగించేలా చూడాలని ఆయన కోరారు. పారాగ్‌లైడింగ్, హట్ బెలూన్స్, మైనింగ్ టూరిజం, టెంపుల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నదీ ప్రాంతంలో బోటింగ్ తదితర ఏర్పాట్లను చేయాలని ఆయన కోరారు.