
సర్కారు బడుల్లో ఏఐ చదువులు
● విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపు లక్ష్యం ● నేటి నుంచి 15 పాఠశాలల్లో అమలుకు నిర్ణయం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాయంతో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేలా ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆరు జిల్లాల్లో పెద్దపల్లికి కూడా చోటుదక్కింది.
3, 4, ఐదో తరగతుల విద్యార్థుల కోసం..
జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదో తరగతి విద్యార్థుల్లో కనీస విద్యాప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యాశాఖ ఏఐ సాయంతో విద్యాబోధన చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ప్రాథమిక స్థాయి నుంచే ఆశించిన స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియల్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించారు.
చదవడం, రాయడంపై..
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు రాయడం, చదవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కృత్రి మ మేథ ఆధారిత ఉపకరణాలతో చదవడం, రా యడంలో వెనకబడిన వారిలో విజ్ఞానం పెంపొందిస్తారు. ఏఐ ద్వారా విద్యా ప్లాట్‌ఫాంలు పర్సనలైజ్డ్ లర్నింగ్ టూల్స్ ద్వారా అభ్యసన మెరుగుపర్చుతా రు. బలహీనతలకు అనుగుణంగా కస్టమైజ్డ్ లర్నింగ్ మోడల్స్ ద్వారా అభ్యసన అందిస్తారు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో విద్యాబోధన..
ఏఐ కార్యాచరణ అమలుకు ఎంపికై న పాఠశాలల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో పిల్లలకు సులభంగా అర్థమయేలా విద్యాబోధన చేస్తారు. 3, 4, ఐదో తరగతి విద్యార్థులను ఐదుగురి చొప్పున బ్యాచ్‌గా ఏర్పాటు చేస్తారు. ప్రతీ బ్యాచ్‌కు తెలుగువాచకం, గణితం అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు చెబుతుంది. ఆ విద్యార్థికి ఏ స్థాయిలో అర్థమైందనే విషయాన్ని నిర్ధారించుకుని సులువుగా అర్థం చేసుకునేలా బోధిస్తారు.
జిల్లాలో నేటినుంచి అమలు..
పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న జిల్లాలో శనివారం నుంచి 15 పాఠశాలల్లో ఏఐ సాయంతో విద్యాబోధన అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు ఇటీవల శిక్షణ కూడా ఇప్పించారు.
పైలెట్ ప్రాజెక్టులోని స్కూళ్లు
మండలం గ్రామం
పెద్దపల్లి ఎంపీపీఎస్, రంగాపూర్
పెద్దపల్లి ఎంపీపీఎస్, మారెడుగొండ
రామగుండం గాంధీపార్క్ గోదావరిఖని
రామగుండం రామగుండం
రామగుండం మల్యాలపల్లి
రామగిరి ఎంపీపీఎస్, నాగేపల్లి
పాలకుర్తి ఎంపీపీఎస్, కన్నాల
ఎలిగేడు సుల్తాన్‌పూర్
ధర్మారం కొత్తూరు
ధర్మారం నర్సింహులపల్లి
కాల్వశ్రీరాంపూర్ గంగారం
ముత్తారం(మంథని) ఖమ్మంపల్లి
మంథని కన్నాల
జూలపల్లి తేలుకుంట
పాలకుర్తి బసంత్‌నగర్