● అక్రమ నిర్మాణం తొలగింపులో వివాదం
విజయనగరం అర్బన్: నగరంలోని మున్సిపల్ కార్యాలయం జంక్షన్‌లో అనుమతులు లేకుండా జరుగుతున్న పోలీసు శాఖ నిర్మాణంపై నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం కొరడా ఝళిపించింది. అయితే విధి నిర్వహణలో భాగంగా అక్రమ నిర్మాణాన్ని తొలగించిన మున్సిపల్ సిబ్బందిపైనే పోలీసులు చేయిచేసుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణ అవసరాలకే అయినప్పటికీ తాత్కాలిక నిర్మాణంగా కాకుండా పక్క శ్లాబ్ నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని..అయితే అలా అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన కార్పొరేషన్ కమిషనర్ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మంగళవారం సంబంధిత స్థలానికి వెళ్లి నిర్మాణాన్ని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చేయచేసుకున్నారని మున్సిపల్ సిబ్బంది ఆరోపించారు. అంతటితో ఆగకుండా సిబ్బందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కమిషనర్ ఆదేశాలతో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను నేరస్తుల్లా స్టేషన్‌కు తీసుకెళ్లడంపై మున్సిపల్ వర్గాల విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
టీపీఎస్‌తో వాగ్వాదం
అంతేకాకుండా పోలీసులు నగరపాలక సంస్థ కార్యాలయాలనికి వెళ్లి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) అనితతో వాగ్వాదానికి దిగారు. తాము కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని, ఏదైనా అభ్యంతరం ఉంటే కమిషనర్‌తో మాట్లాడుకోవాలని పోలీసులకు ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆమెతో వాగ్వాదం కొనసాగించారు. చివరకు ఏ విషయమైనా కమిషనర్‌తోనే మాట్లాడుకోవాలని ఆమె తేల్చిచెప్పారు. కార్యాలయంలోనే అధికారిణితో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగించింది.
పోలీసుల తీరుపై మండిపాటు
ఈ ఘటనపై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం టౌన్ ప్లానింగ్ విభాగం బాధ్యత అని, ఉన్నతాధికారుల ఆదేశాలతో విధులు నిర్వర్తిస్తే దాడులు, అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడడాన్ని అఽధికారులతో పాటు నగర ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో విధులు ఎలా నిర్వర్తించాలని సిబ్బంది ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ సిబ్బందికి రక్షణ కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


