బీసీలు.. అధ్యక్షా.. అనేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

బీసీలు.. అధ్యక్షా.. అనేదెప్పుడు?

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

బీసీలు.. అధ్యక్షా.. అనేదెప్పుడు? జనాభాలో సగానికిపైగా బీసీలే..

‘స్థానిక’ సీట్లలో

ఎక్కడ స్థానం?

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9.25 లక్షలు. ఇందులో బీసీలే 55.5 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం జనాభాలో సగానికిపైగా వెనుకబడిన వర్గాలవారే. అత్యధిక శాతం మంది కొప్పలవెలమ, కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. మొత్తం 451 పంచాయతీల్లో 6,43,874 మంది ఓటర్లుండగా.. ఇందులో బీసీలే 3,48,928 మంది. జనాభాపరంగా గానీ, ఓటర్లపరంగానైనా సగానికిపైగా ఉన్న బీసీల్లో రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని వేలిమీదే లెక్కపెట్టవచ్చు. వీరికి ప్రాధాన్యం లేని నామినేటెడ్‌ పదవులను ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది.

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం మన్యం.. పేరులోనే మన్యం ఉంది. ఏజెన్సీ ప్రాంత జిల్లా. గిరిజన జనాభా కూడా అధికమే. రాజకీయాల్లో శాసనసభ రిజర్వేషన్‌ పరంగా పార్వతీపురం నియోజకవర్గం ఒక్కటే ఎస్సీ కాగా.. మిగతా సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలు ఎస్టీలే. బీసీలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం లభిస్తుందని ‘వెనుకబడిన వర్గాలు’ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాయి. చట్టసభల్లో ‘అధ్యక్షా..’ అనాలని ఆశపడుతున్నాయి. ఆ ఆశలు.. కలలుగానే మిగిలిపోతున్నాయి. చివరికి స్థానిక ఎన్నికల్లో సైతం.. వారికి ప్రాతినిధ్యం కరువవుతోంది. ‘బీసీలు.. బీసీలు..’ అంటూ ఎన్నికల కోసం కపట ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సీట్ల రిజర్వేషన్‌ విషయంలో మరోసారి ఆ వర్గాలకు వెన్నుపోటు పొడిచారు.

జెడ్పీ చైర్మన్‌ పీఠమైనా దక్కాలని..

పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా జెడ్పీ కూడా ఏర్పడింది. తొలిసారి జెడ్పీ పీఠంపై బీసీలను కూర్చోబెట్టాలని ఆయా వర్గాల నాయకులు ప్రజాప్రతినిధుల వద్ద డిమాండ్లు కూడా వినిపించారు. రిజర్వేషన్‌ తమకు అనుకూలంగా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోటీకి సిద్ధమై.. ఈసారి ఎలాగైనా తామే ‘అధ్యక్షా..’ అని పిలుపించుకోవాలని ఆరాటపడ్డారు. ఆ విధంగానైనా బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని భావించారు. ఇటీవల కాలంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆడిన డ్రామాలను కొంతమంది నిజమేనని భావించారు. తీరా.. రిజర్వేషన్లు ప్రకటిస్తేనేగానీ వారికి అసలు తత్త్వం బోధపడలేదు. మరోసారి మోసపోయామంటూ ఇప్పుడు బాధ పడుతున్నారు.

పార్వతీపురం మున్సిపల్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడున్న 36 వార్డుల్లో 11నే బీసీలకు దక్కాయి. ఎస్సీ, ఎస్టీలకు ఏడు ఉండగా.. మిగిలినవన్నీ జనరల్‌ మహిళ, అన్‌రిజర్వుడు స్థానాలే. సాలూరు మున్సిపాలిటీ 32 వార్డుల్లో 11 బీసీలకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు కాగా.. మిగిలినవి జనరల్‌నే. పాలకొండ నగర పంచాయతీలో 28 వార్డులకు గానూ.. 10 మాత్రమే వెనుకబడిన వర్గాలకు దక్కాయి. 14 స్థానాలు జనరల్‌ మహిళ, అన్‌రిజర్వుడువే. సాలూరు, పాలకొండ అధ్యక్ష స్థానాలు బీసీ మహిళకు కేటాయించడం కాస్త ఊరట.

15 జెడ్పీటీసీ స్థానాల్లో గానీ, 15 ఎంపీపీ స్థానాల్లో గానీ ఒక్క బీసీకీ స్థానం ఇవ్వలేదు. జెడ్పీటీసీల్లో, ఎంపీపీల్లో అన్‌రిజర్వుడు ఎనిమిది చొప్పున ఉన్నాయి.

226 ఎంపీటీసీ స్థానాల్లో 35 బీసీలకు కాగా.. అన్‌రిజర్వుడు 98 స్థానాలు ఉన్నాయి.

ఇక, 451 సర్పంచ్‌ స్థానాల్లో కేవలం 64 మాత్రమే బీసీ వర్గాలకు కేటాయించారు. అన్‌రిజర్వుడు స్థానాలు 163 ఉన్నాయి. ఈ గణాంకాలే చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలంటే ఎంత ప్రేముందో చెబుతున్నాయని ఆయా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇంకెప్పుడు?

సీట్ల రిజర్వేషన్‌లో చోటు ఎక్కడ?

అధిక శాతం సీట్లు అన్‌రిజర్వుడుకు..

జనాభాలో సగభాగం.. జడ్పీ చైర్మన్‌ సీటు అయినా దక్కని వైనం

ఆవేదనలో బీసీ వర్గాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement