పార్వతీపురం రూరల్: జంఝావతి రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ చేపట్టిన ‘జంఝావతి సాధన దీక్షలు’ 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో శుక్రవారం శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ వాకాడ ఇందిర, సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, ఏపీ గిరిజన సంఘం నాయకుడు యు.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఎం.శివ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 25 రోజులుగా కొనసాగుతున్న ఈ దీక్షలకు మేధావులు, మహిళలు, న్యాయవాదులు, కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఐదు మండలాలు, 75 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధన కోసం శనివారం పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని సాధన కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
● నేడు పార్వతీపురంలో ర్యాలీ


