పార్వతీపురం: ప్రజల నుంచి వచ్చే అర్జీలను బాధ్యతాయుతంగా, నాణ్యతతో, నిర్ణీత గడువులో పరిష్కరించడమే ప్రధానమని, ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వచ్చిన 105 వినతులను కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తదితరులు స్వీకరించారు. వాటిలో 34 రెవెన్యూకు సంబంధించి కాగా ఇతర దరఖాస్తులు 71 ఉన్నాయి. ప్రతి అర్జీని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీచేశారు.
అర్జీలలో కొన్ని ..
● పార్వతీపురంలోని ఇందిరా కాలనీకి చెందిన సొండి యశోద తన తోపుడు బండి తొలగించడంతో ఉపాధి కోల్పోయానని, ఎస్సీల అభివృద్ధి కోసం నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణం కేటాయించాలని కోరింది.
● గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామానికి చెందిన చింతాడ లక్ష్మి, బీఎస్సీ నర్సింగ్ అర్హతకు అనుగుణంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
● గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాకకు చెందిన బచ్చలి బాబ్జీ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరాడు.
● గోపాలపురానికి చెందిన గిడబ జయమ్మ భూమి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించింది.
● సాలూరు మండలం పెదపదం గ్రామానికి చెందిన పొడి జన్ని లక్ష్మి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
● పాలకొండ మండలం బుక్కూరు గ్రామానికి చెందిన బిత్స రాజగోపాలరావు వారసత్వ భూమికి సబ్‌డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ
పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలోనిర్వహించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ముఖ్యంగా కదలలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి, వారి ఫిర్యాదుల్లోని అంశాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోనన్‌లో మాట్లాడి, నిర్ణీత గడువులోగా తక్షణ చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని, ఆయా నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ వేదికలో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులపై వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌న్‌లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు తదితర అంశాలపై మొత్తంగా 15 ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 30 అర్జీలు
సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 30 అర్జీలు వచ్చాయి. వినతులను ఏపీఓ జి.చిన్నబాబు స్వీకరించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలకు ఇళ్లుకట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఎగువరుగడ గ్రామస్తులు కోరారు. అంతర్గత సీసీ రోడ్లు నిర్మించాలని జె.రామరావు విన్నవించాడు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థికసాయం అందించాలని శంభాం గ్రామానికి చెందిన నిమ్మక కుమారి వినతి ఇచ్చారు. ఆయిల్ ఇంజిన్లు ఇప్పించాలని గొడ్డ గ్రామస్తురాలు పి.పోలమ్మ కోరింది. సవర భాషా వలంటీర్ పోస్టు ఇప్పించాలని సారకు చెందిన బిడ్డిక నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, పీహెచ్‌వో ఎస్.వి. గణేష్ తదితరులు పాల్గొన్నారు.


