పార్వతీపురం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినికిడి సమస్యతో బాధపడుతున్న ముగ్గురికి కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి వినికిడి పరికరాలను అందజేశారు. పార్వతీపురం మండలం, పార్వతీపురం పట్టణానికి చెందిన కొమ్మాన పద్మావతి, పాలకొండ మండలం జమ్మిరాజుపేటకు చెందిన నీలాపుర గంగయ్య, పాలకొండ మండలం కోమటిపేటకు చెందిన శిల్లా మార్కెండేయులు పరికరాలకోసం అర్జీలను సమర్పించగా, కలెక్టర్ తక్షణమే స్పందించి వాటిని అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ సీహెచ్.ప్రభావతి, వికలాంగుల సంక్షేమశాఖ ప్రతినిధి రమణ తదితరులు ఉన్నారు.
గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
పార్వతీపురం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో మన్యం అగ్రి క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, నీటి సంరక్షణ రంగాలను అనుసంధానించి రైతులకు మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ప్రకృతి సేద్యం, సేంద్రియ ఎరువులు, డిజిటల్ వ్యవసాయం, మార్కెటింగ్‌పై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం, నీతి ఆయోగ్ సహకారంతో పీవీటీజీ గ్రామాల్లో సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ విద్యార్థికి తీవ్ర గాయాలు
● బస్సు దిగుతుండగా వెనుక చక్రం కింద పడ్డ కుడి కాలు
కురుపాం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న డి.మహేష్ అనే విద్యార్థి కుడి కాలికి సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే మోడల్ స్కూల్లో చదువుతున్న డి.మహేష్ ప్రతిరోజూ గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం స్కూల్‌కు రాక పోకలు సాగిస్తుంటాడు. ఎప్పటి లాగానే సోమవారం గుమ్మలక్ష్మీపురం నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి కురుపాం ఆదర్శపాఠశాల జంక్షన్‌లో దిగుతుండగా బస్సు డ్రైవర్ వేగంగా బస్సునడపడంతో మహేష్ వెనుక చక్రం కింద తన బ్యాగుతోపాటు పడి పోవడంతో కుడి కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించగా కుడి కాలికి ఎనిమిది కుట్లు పడ్డాయి. ప్రస్తుతం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ ఊడికిలపేట గ్రామానికి చెందిన సిరిగిడి జనార్దన్(53) విజయనగరంలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని హెచ్‌సీ కృష్ణ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలంగా పక్షవాతంతో కదలలేని స్థితిలో బాధపడుతన్న సిరిగిడి జనార్దన్ ఈనెల 25వ తేదీన ఫ్లోర్ క్లీనర్ తాగేశాడు. చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 30న రాత్రి మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై రాజ్యలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


